ఆదివారం ఖమ్మంలో జరిగిన ప్రజా గర్జన సభలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం వచ్చినప్పుడు అక్కడ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు తదితర సీనియర్ నేతలతో కాసేపు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు తనకు తెలుసని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని, అమరావతి, పోలవరం నిర్మాణ పనులు పూర్తిచేయిస్తామని చెప్పారు.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం తెలిపేందుకు త్వరలోనే మళ్ళీ ఏపీలో పర్యటిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు.
దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినప్పుడు కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాంగ్రెస్‌ను భుజాన్న పెట్టుకొని మోశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏనాడూ ఏపీని, రాష్ట్ర కాంగ్రెస్ నేతలం, రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని, వారి మనోభావాలను గౌరవించలేదు. పార్లమెంట్ తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదించింది.
కేవీపీ రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్ తదితరులు తీవ్రంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం వారిని కూడా పట్టించుకోలేదు. లేదా వారే తమ అధిష్టానం సూచన మేరకు, ఏపీలో కాంగ్రెస్‌కు నష్టం కలగకుండా కాపాడుకొనేందుకు ఆవిదంగా డ్రామాలు చేసి ఉండొచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏపీ కాంగ్రెస్ నష్టపోయినా పర్వాలేదు తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే చాలనుకొని రాష్ట్ర విభజన చేసింది. కానీ ఏపీ ప్రజల ఉసురు తగిలి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక కేంద్రంలో కూడా అధికారం కోల్పోయింది.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకొనేందుకే వైఎస్ షర్మిలని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండటం గురించి అందరూ వింటూనే ఉన్నారు. కనుక ఏపీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవం పోసేందుకే రాహుల్ గాంధీ మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారని చెప్పవచ్చు.
రాహుల్ గాంధీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కాపాడాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇక్కడ స్టీల్ ప్లాంట్ గేటు దగ్గర కాదు… ఢిల్లీలో పార్లమెంటులో గట్టిగా పోరాడాలి! కానీ పార్లమెంటులో కాంగ్రెస్, బిజెపిలు ఏదో ఓ అంశం పట్టుకొని కీచులాడుకొంటూ కాలక్షేపం చేస్తుంటాయే తప్ప రెండు తెలుగు రాష్ట్రాలకు సంబందించిన అంశాలపై చర్చించిన సందర్భాలు చాలా తక్కువ.
అదే… వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర ఆందోళన చేస్తే కాంగ్రెస్ పట్ల ప్లాంట్ ఉద్యోగులకి, రాష్ట్ర ప్రజలకి మళ్ళీ సానుభూతి కలిగి ఓట్లేస్తారని కాంగ్రెస్ దురాశ పడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం ఈవిదంగా ఏపీ ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా పార్టీ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంటుంది కనుకనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది.
అయినా ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ కేంద్రంలో గానీ అధికారంలోకి రావడం దాదాపు అసంభవమే. కనుక రాహుల్ గాంధీ నిరభ్యంతరంగా ఎన్ని హామీలైనా ఇవ్వొచ్చు. ఎంత కన్నీరైనా కార్చవచ్చు.



