ఏపీకి స్వీట్ న్యూస్… రైల్వే జోన్ ప్రకటన..!

Railway-minister-suresh-prabbhuరాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక చిక్కుల్లో పడిపోయిన ఏపీకి అవసరమైన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్ విషయాల్లో ఓ అంశంలో ముందడుగు పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ ను ‘ఏపీ ఎక్స్ ప్రెస్’గా ఉండేది. అయితే, ఆ తర్వాత దానిని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ‘తెలంగాణ ఎక్స్ ప్రెస్’గా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

ADVERTISEMENT

నాటి నుంచి విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కావాల్సిందేనన్న డిమాండ్ నానాటికి పెరిగిపోయింది. అయితే వీటిలో ఏ ఒక్క దానికి కూడా కేంద్రం సానుకూలంగా స్పందించేందుకు సిద్ధంగా లేకపోవడంతో… ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల విందు రాజకీయాలకు తెర తీశారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తన కోటాలోని ఓ సీటును బీజేపీ నేత, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు ఇచ్చారు. ఈ సందర్భంగా విజయవాడకు వచ్చిన ప్రభుకు విందు ఏర్పాటు చేసిన చంద్రబాబు.. రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి తరలి వెళ్లే ఉద్యోగుల కోసమంటూ ‘సికింద్రాబాద్ – విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్’ పేరిట ప్రత్యేక రైలుకు ప్రభు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైలు ఈ నెల 20న పట్టాలెక్కనుంది. తాజాగా ప్రత్యేక జోన్ కూడా సాకారం దిశగా ప్రభు నుంచి చంద్రబాబు సర్కారుకు మరో వార్త చేరింది.

“సౌత్ ఈస్ట్ కోస్ట్ జోన్” పేరిట ఏర్పాటు కానున్న ఈ జోన్ ను త్వరలోనే సురేశ్ ప్రభు స్వయంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ నెల 21న ఈ మేరకు ప్రభు ఈ జోన్ పై ప్రకటన చేస్తారన్న సమాచారం కూడా ఏపీకి చేరినట్లు తెలుస్తోంది. ఆది నుంచి ప్రత్యేక రైల్వే జోన్ కు సంబంధించి తీవ్ర వ్యతిరేకతతో ఉన్న రైల్వే బోర్డు చైర్మన్ కూడా సురేశ్ ప్రభు సానుకూలతతో తన వైఖరి మార్చుకున్నట్లు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories