ఏ భాషలో చిత్రమైనా ఎదుర్కొనే ప్రధాన సమస్య పైరసీ. ఇది అందరికీ తెలిసిన సంగతే. సినిమా తయారీలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదో ఒక రూపంలో పైరసీ బాధిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ మహారాజా రవితేజ చిత్రం ‘రాజా ది గ్రేట్’ విడుదలైన రెండో రోజే ఆన్ లైన్ లో పైరసీ లింక్స్ బయటపడ్డాయి.
కమర్షియల్ గా సక్సెస్ ఫుల్ ఫిల్మ్ గా నిలిచే అవకాశాలున్న ఈ సినిమాను తాజాగా ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి తన ల్యాప్ టాప్ లో చూడడం సోషల్ మీడియాకు ఎక్కింది. దీంతో ఇ చిత్ర దర్శకనిర్మాతలు సదరు ఫోటోను షేర్ చేసుకుంటూ సినిమాను బ్రతికించాల్సిందిగా కోరారు.
“ఎయిర్ పోర్టు లాంజ్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ ‘రాజా ది గ్రేట్’ సినిమాను చూస్తున్నారు. చాలా దురదృష్టకరం. సినిమాలను బతికించండి ప్లీజ్” అని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. కొంతమంది తమ చిత్రాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంటున్నారని, ఇటువంటి వారిని ఎంకరేజ్ చేయవద్దని, సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కోరింది.


