‘బాహుబలి 2’ వంటి అమోఘమైన విజయం తర్వాత జక్కన్న చేయి ఏ హీరో మీద పడబోతుందా? అని యావత్తు ఇండియన్ చిత్ర పరిశ్రమ ఎదురు చూస్తున్న నేపధ్యంలో… ఏకంగా మల్టీస్టారర్ కు శ్రీకారం చుడుతూ రాజమౌళి ట్రేడ్ వర్గాలను అవాక్కు చేసారు. అయితే ఇది అనధికారికంగా కావడంతో, సదరు హీరోల అభిమానులు పండగ చేసుకోవడానికి లేకుండా పోయింది. మరి అధికారిక వార్త ఎప్పుడు వస్తుంది? అని ఎదురుచూస్తున్న సినీ జనాలకు ఈ సంక్రాంతి నాడు ఆ తీపికబురును జక్కన్న వినిపించబోతున్నాడనేది లేటెస్ట్ అండ్ హాటెస్ట్ న్యూస్.
అవును… మెగా అండ్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ తో పాటు యావత్తు సినీ అభిమానులు ఎదురుచూస్తోన్న ఆ భారీ మల్టీస్టారర్ కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ను ఈ సంక్రాంతి పర్వదినాన ప్రకటించడానికి సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అయితే ఇప్పుడు ఇస్తున్నారు గానీ, సినిమా ప్రారంభం అయ్యేది మాత్రం దసరా నాటికే అన్నది అసలు విషయం. ప్రస్తుతం చెర్రీ ‘రంగస్థలం’ పూర్తి కానుండగా, బోయపాటి దర్శకత్వంలో సినిమాను దసరా నాటికి పూర్తి చేయనున్నాడు.
అలాగే మరో పక్కన జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసుకుని జక్కన్న కోసం రెడీ అవ్వనున్నారు. దీంతో ఈ స్టార్ హీరోలతో అక్టోబర్ నాటికి ఈ సినిమాను పట్టాలెక్కించాలని రాజమౌళి భావిస్తున్నారట. 1000 కోట్లు అసాధ్యం అనుకున్న దానిని ఒక ప్రాంతీయ భాషా చిత్రంతో సుసాధ్యం చేసి చూపించిన రాజమౌళి, అసలు భారీ మల్టీస్టారర్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక కలే అన్న టాక్ నేపధ్యంలో… దానిని కూడా ఆచరణలోకి తీసుకురావడం బహుశా జక్కన్నకే దక్కుతుందేమో!



