తన అభిమానులకు రాజకీయ పాఠాలు నేర్పక్కర్లేదని తమిళ రాజకీయ పార్టీల నేతలకు ప్రముఖ నటుడు రజనీకాంత్ కాస్త ఘాటుగానే సమాధానం ఇచారు. చెన్నైలో ప్రజా సంఘాలు నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన రజనీ… తన అభిమానులు రాజకీయ నాయకులకే పాఠాలు చెప్పగల సమర్థులని తెలిపారు.
తన పార్టీ 32 ఏళ్ల చరిత్ర కలిగిన అభిమాన సంఘాల నుంచి ఉద్భవిస్తున్న విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తించాలని సూచించారు. తాము చేయాల్సిందల్లా తమ పార్టీని బలోపేతం చేయడమేనని, జిల్లా ఇన్ ఛార్జీలను నియమించిన తరువాత తాను రాష్ట్ర పర్యటన చేపడతానని రజనీకాంత్ తెలిపారు.
కాగా, తన సహనటుడు కమలహాసన్ నిర్వహించిన ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అరంగేట్ర సమావేశం చూశానని, కమల్ ది, తనది దారులు వేరైనా లక్ష్యం ఒకటేనని అన్నారు. తమిళులకు మంచి చేయడమే కమల్, తన లక్ష్యంగా సూపర్ స్టార్ పేర్కొన్నారు. ఫ్యాన్స్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభిమానుల మనసును తాకాయి.



