ప్రముఖ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు కోలీవుడ్ లో భారీగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చించేందుకు అభిమానులంతా ఏప్రిల్ 2న చెన్నైకు రావాలని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఆ రోజు అభిమానులతో నిర్వహించే సమావేశంలో రాజకీయ రంగ ప్రవేశంపై ఓ కీలక ప్రకటన చేస్తారని తమిళనాడులో వార్తలు హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత చోటుచేసుకున్న రాజకీయ శూన్యత నేపథ్యంలో… రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ఇప్పటికే రకరకాల చర్చలు జరిగాయి. ఓ పక్కన రావాలని అభిమానులు పిలుపునిస్తుండగా, స్వతహాగా రాజకీయాలకు దూరంగా ఉండే రజనీ సైలెంట్ గా ఉంటూ వచ్చారు. అయితే రజనీ సోదరుడు మాత్రం ఒకటి, రెండు సందర్భాలలో ఫ్యాన్స్ కు పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
తాజాగా శ్రీలంకలో తమిళులను కలవవద్దంటూ పలు పార్టీలు సూచించిన నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్న రజనీ, ఓ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఆయన ఏప్రిల్ 2న అభిమానులంతా చెన్నై రావాలని లేఖలు రాయడంతో, సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రానున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే ఇది సాధారణ సమావేశమేనని, ఇటీవలే కమల్ హాసన్ కూడా తన అభిమానులతో సమావేశం నిర్వహించాడని గుర్తు చేస్తున్నారు.



