“బాహుబలి” తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ కు ‘బ్రాండ్ అంబాసిడర్’గా మారిన ప్రభాస్ ఫేంకు తగిన విధంగానే తదుపరి సినిమా కూడా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపుదిద్దుకుంటూ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారారు. ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉంటాడు? అన్న ఆసక్తి ‘యంగ్ రెబల్ స్టార్’ అభిమానులతో పాటు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో నెలకొందంటే… ప్రభాస్ పై ఎన్ని కళ్ళు చూస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
అంతలా ఖ్యాతిని సంతరించుకున్న ప్రభాస్, తన సినిమా “సాహో”ను వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా ఎలా రూపుదిద్దుకుంటుందో కూడా తెలియకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు వహిస్తుండడంతో ఆ ఆసక్తి మరింత రెట్టింపయ్యింది. ప్రభాస్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ గానీ, వీడియో గానీ విడుదలైతే కాస్త స్పష్టత వస్తుందేమో! మరి ఆ రేంజ్ కు వెళ్ళిన ప్రభాస్ కు ఎదురుగా ప్రస్తుతం సినిమా విడుదల చేయాలంటే సాహసమే అనుకోవచ్చు.
అలాంటి సాహసాన్నే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అవును బోయపాటి దర్శకత్వంలో చెర్రీ నటించబోయే సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అత్యంత వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి 2018 దసరా నాటికి విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణయించింది. అంటే వచ్చే ఏడాది రామ్ చరణ్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్న మాట. అయితే “సాహో”కు ఎదురుగా రావడం మాత్రం కాస్త ఆలోచించదగ్గ విషయమే.


