రీ రిలీజులను అభిమానులు చాలా పర్సనల్ గా తీసుకుంటున్నారు. వాటి అసలైన విడుదల తేదీలకు మించి హంగామాని, సోషల్ మీడియాలో గర్వంగా చెప్పుకునే కలెక్షన్లను ఇవ్వడం కోసం గంపగుత్తగా టికెట్లు కొంటున్న ఫ్యాన్స్ అసోసియేషన్లు బోలెడు. పోకిరితో మొదలుపెట్టారు. జల్సాతో పీక్స్ కు తీసుకెళ్లారు. మధ్యలో రెబెల్, వర్షం, చెన్నకేశవరెడ్డి, ఘరానా మొగుడు అంటూ చాలానే వచ్చాయి. కొన్నిటికి వసూళ్లు బాగా వస్తే మరికొన్నింటికి పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. ఇక్కడ సీరియస్ గా చూడాల్సిన పాయింటొకటి ఉంది.
వీటి సంబరాలు కొత్త సినిమాలను దెబ్బ కొడుతున్నాయి. ఉదాహరణకు నిన్నటి నుంచి ట్విట్టర్, ఇన్స్ టా ఎక్కడ చూసినా ఆరంజ్ తాలూకు సెలెబ్రేషన్ వీడియోలు విపరీతంగా వైరలవుతున్నాయి. దీంతో తామేదో ఎంజాయ్ మెంట్ మిస్ అవుతున్నామని ఫీలైన ఇతర అభిమానులు అప్పటికప్పుడు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుని థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోనే ఇరవై లక్షలకు పైగా కేవలం రెండు రోజులు పూర్తి కాకుండానే వసూలు చేయడాన్ని ఏ కోణంలో చూడాలి. అన్ని షోలు హౌస్ ఫుల్లే.
కానీ అదే ప్రాంతంలో ఆడుతున్న లేటెస్ట్ రిలీజులు దాస్ కా ధమ్కీ, రంగమార్తాండలకు ఆ స్థాయి జనం లేరు. వీకెండ్ ఏదో ఒక సినిమా చూడనిదే పొద్దుపోని న్యూట్రల్ ఆడియన్స్ గోలలు ఈలలు మధ్య ఆరంజ్ నే ఎంజాయ్ చేద్దామనుకోవడం సహజం. చాలా చోట్ల ఫ్యామిలీస్ వచ్చిన దృశ్యాలు కనిపించాయి. ఒకవేళ ఆరంజ్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ భారీ మొత్తంలో కనీసం సగం కొత్త సినిమాలకు దక్కేది. ఇప్పుడే కాదు పైన చెప్పిన వాటితో సహా ఇవి వచ్చినప్పుడంతా ఇదే సమస్య మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతోంది.
ఉద్దేశం ఏదైనా ఈ ట్రెండ్ ని మరీ ఇంతగా పెంచి పోషించడం ఎంత వరకు కరెక్ట్ అనేది నిర్మాతలు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఎవరు చూడమని బలవంతం చేయడం లేదనే లాజిక్ కొందరు తీయొచ్చు. అయితే మద్యపానం చేయమని ప్రభుత్వాలు చెప్పవు. కానీ అమ్ముతాయి. తాగడం తాగకపోవడం మన విచక్షణ. దొరుకుతోంది కాబట్టి మునిగితేలే వాళ్లే ఎక్కువ. ఇప్పుడిలా గంపగుత్తగా పాత సినిమాలన్నీ థియేటర్లలోకి వదులుతూ పోతే కొత్తవి ఓటిటిలో చూద్దామనే ధోరణి పెరిగిపోతుంది. అదింకా ప్రమాదం. ఏదో నాలుగైదు నెలలకు ఒకటి రెండంటే ఓకే కానీ మరీ ఇలా నాన్ స్టాప్ గా చేయడం మాత్రం రాబోయే రోజుల్లో మరింత రిస్క్ అవుతుంది



