వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొన్నా ఆ మధ్య ‘పవర్‌స్టార్’ పేరుతో ఒక సినిమా తీసి మెగా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ విషయం పై మెగా అభిమానులు భగ్గుమని రామ్ గోపాల్ వర్మ ఆఫీసు ను ఎటాక్ చేసే దాకా వెళ్ళింది. గత కొద్ది రోజులుగా రామ్ గోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తాడని పుకార్లు వస్తున్నాయి.

2004 లో బాలకృష్ణ నివాసంలో జరిగిన వివాదాస్పద షూటింగ్ సంఘటనపై ఆయన సినిమా తీయనున్నట్లు నివేదికలు సూచించాయి. ఈ ప్రమాదంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు బుల్లెట్ గాయం తగిలింది. అది పోలీసులు, కేసుల దాకా వెళ్లి ఆ తరువాత ఎలానో సమసిపోయింది. ఇప్పుడు ఆ ఘటనను రాము తవ్వుతున్నాడని వార్తలు వచ్చాయి.

ఈ చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మను ఒక ఇంటర్వ్యూలో అడిగారు. ప్రస్తుతానికి తనకు అలాంటి ప్రణాళికలు లేవని ఆ వివాదాస్పద దర్శకుడు స్పష్టం చేశారు. దానితో నందమూరి అభిమానులు శాంతించారు. గతంలో బాలయ్యతో రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ తీయాల్సింది.

అయితే ఏదో కారణంగా అది జరగలేదు. అది మనసులో పెట్టుకునే రాము లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి అందులో నందమూరి కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశాడని చాలా మంది అంటారు. అయితే ప్రస్తుతానికి రాము బాలయ్య జోలికి వెళ్లే ఉద్దేశం లేనట్టుగా స్పష్టం అయ్యింది.