సినీ హీరోగా కెరీర్ ప్రారంభించి… రానూ రానూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు రంగనాథ్ మృతి చెందారు. చెన్నైలోని కవాడీగూడలోని తన సొంత నివాసంలో కన్ను మూసారు. దాదాపు 50 సినిమాల్లో హీరోగా, మరో 50 సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన రంగనాథ్, షుమారుగా 200కు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.
‘సహజ’ నటుడిగా ఎంతో కీర్తిప్రతిష్టలను తెచ్చుకున్న రంగనాథ్ ది ‘సహజ’ మరణం కాదని బందువులు ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో బంధువుల నుండి ఓ ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం అందుతోంది. అనుమానాస్పదపు కోణంలో రంగనాథ్ మృతిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నాటి చిరంజీవి నుండి నేటి మహేష్ వరకు దాదాపుగా అందరి హీరోలతో పని చేసిన ఘనత రంగనాథ్ సొంతం. 1973లో ‘చందన’ సినిమాతో పరిచయం అయిన రంగనాథ్ కు ‘పంతులమ్మ’ ఎనలేని పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది.





