ప్రపంచ వ్యాప్తంగా మార్చి 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోన్న సుకుమార్ – రామ్ చరణ్ ల “రంగస్థలం” సినిమా, ప్రస్తుతం ప్యాచ్ వర్క్ ను జరుపుకుంటోంది. విడుదలైన ఫస్ట్ టీజర్ వీక్షకులను ఆకట్టుకోగా, మొదటి పాట ‘ఎంత సక్కగున్నావే’ అన్న పాట సంగీత, సాహిత్య శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. ఇలా ఒక్కొక్కటిగా ‘రంగస్థలం’ సినిమాపై అంచనాలు పెంచుతున్న నేపధ్యంలో… ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన సమాచారం అందింది.
ఈ ఈవెంట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని శ్రేయాస్ గ్రూప్ సంస్థ ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా, తాజాగా తేదీ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 18వ తేదీన విశాఖపట్నంలోని ఆర్.కే.బీచ్ లో ‘రంగస్థలం’ మేనియాకు రంగం సిద్ధమవుతుందనేది సమాచారం. విశాఖ వేదిక అన్న టాక్ ఇంతకుముందే వ్యక్తం కాగా, లేటెస్ట్ గా వెన్యూను ఆర్.కే.బీచ్ గా ఫిక్స్ చేసారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
‘చిట్టిబాబు’ పాత్రలో ‘సౌండ్’ ఇంజినీర్ గా రామ్ చరణ్ నటిస్తుండగా, రామలక్ష్మి పాత్రలో ‘కుందనపు బొమ్మ’ సమంత కనువిందు చేయనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫీ నిర్వహించారు. గ్రామీణ రాజకీయాల నేపధ్యంలో… ఓ రివేంజ్ స్టోరీని సుకుమార్ తనదైన శైలిలో తీర్చిదిద్దారని, మెగా అభిమానులు అంచనాలు మించే విధంగా సినిమా ఉంటుందనేది సినీ జనాల మాట.



