మాస్ మహారాజాగా ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్న హీరో రవితేజ, ఇటీవల కాలంలో లాంగ్ బ్రేక్ ను తీసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని అద్భుతమైన సందర్శనా ప్రాంతాలను వీక్షిస్తున్న రవితేజ సినిమా కోసం అభిమానులు గత కొంతకాలంగా నిరీక్షిస్తున్నారు. అయితే వారందరికీ తీపికబురును అందించే విధంగా మాస్ మహారాజా సిద్ధమవుతున్నాడనేది లేటెస్ట్ న్యూస్.
‘విక్రమార్కుడు, పవర్’ సినిమాలలో ఫుల్ లెంగ్త్ పోలీస్ గా కనిపించిన రవితేజ, మరోసారి అదే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని, తమిళంలో సూపర్ హిట్ అయిన ‘సేతుపతి’ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ‘డాన్ శీను, బలుపు’ వంటి కమర్షియల్ సక్సెస్ లు ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.
రవితేజకు బాగా అచ్చివచ్చిన పాత్రలలో పోలీస్ పాత్రలు నెంబర్ 1 స్థానంలో ఉంటాయి. సినిమా అంతా కాకపోయినా ‘కిక్, మిరపకాయ్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా రవితేజ పోలీస్ పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో లేటుగా ఎంట్రీ ఇస్తున్నా… లేటెస్ట్ గా హిట్ కొట్టడం ఖాయమన్న టాక్ మాస్ మహారాజా అభిమానుల నుండి వ్యక్తమవుతోంది.



