ప్రస్తుతం విచారణ జరుగుతున్న 12 మంది సెలబ్రిటీల జాబితాలో ఉన్న ఏకైక అగ్ర హీరో మాస్ మహారాజా రవితేజ ఒక్కరే. తన సోదరుడు భరత్ కాలం చేసిన నాటి నుండి మీడియా వర్గీయులకు టార్గెట్ అయిన రవితేజ, ఈ శుక్రవారం ఉదయం సిట్ విచారణకు హాజరు కానున్నారు. దీంతో మీడియా వర్గీయులతో పాటు అభిమానులు, సినీ ప్రేక్షకుల చూపులన్నీ ప్రస్తుతం రవితేజపైనే ఉన్నాయి. దీనికి తోడు మీడియా వర్గీయులలో ప్రసారం అవుతోన్న పలు ఆసక్తికర అంశాలు మరింత ఉత్కంఠతను పెంచుతున్నాయి.
అవును… ఇప్పటివరకు జరిగిన సెలబ్రిటీ విచారణలో కాల్విన్ తో సంబంధాలపైనే ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ రవితేజ పరిస్థితి అలా కాదు. ఈ కేసులో మరో నిందితుడిగా పోలీసులకు చిక్కిన జిషాన్ తో కూడా రవితేజకు సంబంధాలు ఉన్నాయన్న సమాచారం అభిమానుల్లో ఆందోళనను పెంచుతోంది. డ్రగ్స్ సరఫరాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జిషాన్ కు, గత ఆరేళ్ళుగా రవితేజతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అలాగే డ్రగ్స్ కూడా సరఫరా చేసినట్లుగా అంగీకరించాడన్న విషయం హైలైట్ అవ్వడమే ఈ ఆందోళనకు కారణం.
దీంతో రవితేజ విచారణ ఎలా సాగనుంది? ఎంతసేపు జరగనుంది? సాయంత్రం అయిదు లోపున ముగించేస్తారా? లేక పూరీ, తరుణ్, నవదీప్ ల మాదిరి రాత్రి సమయం వరకు జరుగుతుందా? బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ళు ఇవ్వడానికి రవితేజ సుముఖత చూపుతారా? ఇలాంటి అనేక ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. కాల్విన్, జిషాన్ ల మొబైల్స్ లో రవితేజ పేరు ఉండడం ఒక విషయమైతే, రవితేజ మొబైల్ లో కూడా వారి పేర్లు ఉన్నాయన్న మీడియా వర్గీయుల కధనాలతో, ఈ కేసులో అత్యంత కీలకమైన రోజుగా ఈ శుక్రవారం నాడు జరిగే రవితేజ విచారణ మారనుంది.


