తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే సిఎం చంద్రబాబు నాయుడు-పట్టిసీమ-గోదారి నీళ్ళు అంటూ ప్రతీరోజూ క్యూసెక్కుల కన్నీరు కార్చేస్తూనే ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నేతల బాధ, ఒత్తిళ్ళు భరించలేక కాంగ్రెస్ మంత్రులు హడావుడిగా వివిధ ప్రాజెక్టులలో పంపులు ఆన్ చేయించి నీళ్ళు తోడిస్తూనే ఉన్నారు.
కనుక తమ ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఎత్తిపోస్తోందని ఊరూవాడ గొప్పగా చెప్పుకోవచ్చు. కేటీఆర్, హరీష్ రావులు ఈ క్రెడిట్ క్లెయిం చేసుకొని సంతోషించాలి. కానీ ఇద్దరూ బాధ పడటానికే మొగ్గుచూపుతున్నారు.
సిఎంగా రేవంత్ రెడ్డి అన్ ఫిట్ అని తేల్చి చెప్పేస్తూనే, గోదావరి-పట్టిసీమ అంటూ బాధపడుతూనే ఉన్నారు. అయితే వారి బాధకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.
తాము ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుని కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ళయినా మరమత్తులు చేయించకుండా తాత్సారం చేస్తూ, దానికి కేసీఆరే కారణమని నిందిస్తుండటం. రేవంత్ రెడ్డి బుర్రలో దీనిపై ఎటువంటి వ్యూహం ఉందో తెలియక ఆందోళన కలిగిస్తుండటం.
సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రాలో సిఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాలకు శాస్వితంగా నీటి సమస్య పరిష్కరించేందుకు ఏక కాలంలో అనేక ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తుండటం మరో బలమైన కారణంగా కనిపిస్తోంది.
సీమ జిల్లాలలో మొత్తం 9.80 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేందుకుగాను రూ.20,884 కోట్లుకేటాయించారు. వీటిలో హంద్రీ నీవా జలస్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, పోలవరం, పట్టిసీమ, వేదవతి, పోతిరెడ్డిపాడు వెలిగొండ వంటి పాత ప్రాజెక్టులతో పాటు, సీమలో అడవిపల్లి, గోరకల్లు, అలగనూరు, జీడిపల్లి రిజర్వాయర్లు., వాటి కాలువల నిర్మాణ పనులు వేగవంతం చేశారు.
రాయలసీమ జిల్లాలలోనే చిన్నా పెద్ద, కొత్త పాత అన్నీ కలిపి ఏకంగా 1,049 ఎత్తిపోతల ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టున్నారు.
అంతేకాదు.. వీటి కింద ఉండే 1,011 చెరువులలో పూడికలు తీయించి మంచినీటితో నింపడం, కాలువలు, చెరువులతో భూగర్బ జలాలు పెంచడం ద్వారా బోరు బావులు రీచార్జ్ చేసి పునర్వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం జరుగుతున్న ఈ పనులన్నీ పూర్తయితే ఇటు కృష్ణా, ప్రకాశం మొదలు అటు కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం వరకు త్రాగు, సాగునీటి సమస్యలు శాశ్వితంగా తీరిపోతాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ నీటి కష్టాలు తీర్చేశామని బీఆర్ఎస్ పార్టీ సంబరపడితే అది నిరుపయోగంగా మిగిలింది. ఇదే సమయంలో కరువు పీడిత రాయలసీమలో ఒకేసారి ఇన్ని పనులు చకచకా జరుగుతున్నాయి. కనుక ఆ మాత్రం కన్నీరు పారక మానదు.
Godavari నీళ్లు AP కి తరలిపోతున్నాయి…
Chandrababu పట్టిసీమ లిఫ్ట్ నడుపుతున్నారు. మరి తెలంగాణలో నీళ్లు లేవని ఎలా చెబుతారు?
–@KTRBRS pic.twitter.com/h38t7B2Pi4
— M9 NEWS (@M9News_) July 21, 2026




