ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు, అధికారం అన్నీ కూడా రెడ్ల చేతుల్లోనే ఉండేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండే కడప, కర్నూలు జిల్లాలు ఏపీలోకి వచ్చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా హటాత్తుగా తగ్గిపోయింది.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఏపీలో ప్రస్తుతం రెడ్ల రాజ్యం సాగుతోంది. ముఖ్యమంత్రి నుంచి ఉన్నతస్థాయి అధికారులు, చివరికి టీటీడీ వంటి పుణ్యక్షేత్రాల పాలక మండళ్ళలో సైతం రెడ్డి సామాజికవర్గానికే తొలి ప్రాధాన్యత. వారిదే పెత్తనం.
సిఎం జగన్మోహన్ రెడ్డి పేరుకు ‘నా బీసీలు, నా ఎస్సీఎస్టీలు’ అని గొప్పగా చెప్పుకొంటున్నా మంత్రివర్గంలో కూడా వారి గొంతులు వినబడవు. వైనబడితే అవి జగన్ భజన చేసేందుకే. అధినేత అండ్ కోని బట్టే కులమతాల ప్రాధాన్యతలు, బలాబలాలు మారుతుంటాయి కనుక ఏపీలో రెడ్ల డామినేషన్ సహజమే.
కానీ తెలంగాణ ప్రభుత్వంలో కూడా నేటికీ వారిదే పైచేయిగా ఉండటమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి కేసీఆర్ వెలమసామాజిక వర్గానికి చెందినవారు కనుక ఆయన వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత లభించాలి. కానీ ఈరోజు కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాలో 40 మంది రెడ్లు, 11 మంది మాత్రమే వెలమలు ఉన్నారు.
తెలంగాణ జనాభా ప్రాతిపదికన చూసుకొన్నా బీసీలే ఎక్కువగా ఉన్నారు. కనుక వారికే ఎక్కువ సీట్లు దక్కాలి. కానీ 40 సీట్లు రెడ్లకు లభించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి 61 సీట్లు మాత్రమే కేసీఆర్ కేటాయించారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా నేటికీ రెడ్లదే పైచేయి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇలా… ఆ జాబితా చాలా పెద్దదే ఉంది.
ఇక బిజెపిలో కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా కిషన్‌రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.
అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (బీఎస్పీ) వి.హనుమంతరావు (కాంగ్రెస్) వంటి వారు బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం కావాలని గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ ఎన్నికలు, పదవులు, అధికారం అన్నీ డబ్బుతో ముడిపడి చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన ఈ రోజుల్లో బడుగు బలహీనవర్గాల ప్రజల ప్రతినిధులు కనీసం ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కనుక డా.అంబేడ్కర్ విగ్రహాలతో, సంక్షేమ పధకాలతో వారిని అందరూ బుజ్జగిస్తున్నట్లున్నారు.





