టీఆర్ఎస్ సర్కార్ పై ఒంటి కాలుతో లేచే టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందా? అది కూడా ప్రభుత్వ పరంగా? దీనికి సమాధానమైతే తెలియదు గానీ, రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. “తెలంగాణా సర్కార్ నుండి తనకు ముప్పు ఉందని, తనకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని” హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసారు.
దీనిపై స్పందించిన ప్రభుత్వం తమకు వారం రోజుల గడువు కావాలని కోర్టును విన్నవించుకుంది. అయితే రేవంత్ రెడ్డికి భద్రత కల్పించడానికి ఉన్న అడ్డంకులు ఏమిటో తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణా తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్కరుగా అధికార పార్టీలోకి వెళ్ళిపోతున్నా… సండ్రతో పాటు పార్టీ కోసం పనిచేస్తున్న ‘ఒకే ఒక్కడు’గా మిగిలిన వ్యక్తి రేవంత్ రెడ్డి.
తెలంగాణాలో పార్టీ భవిష్యత్తుకు ఆశాకిరణంగా భావిస్తున్న రేవంత్ రెడ్డి ఒక్కరే టీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పెట్టే విధంగా విమర్శలు చేస్తున్న వైనం తెలిసిందే. నిజానికి రేవంత్ వ్యక్తపరుస్తున్న విమర్శలు నేటివి కావు. టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి లోపాలను ఎత్తి చూపుతూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వీటి పర్యవసానమే… ఓటుకు నోటు కేసు అన్న విషయం కూడా రాజకీయ వర్గాల్లో హల్చల్ చేసిన విషయం బహిరంగమే. ఈ తరుణంలో ఏకంగా తనకు ముప్పు ఉందని ఆశ్రయించడం తెలంగాణా పొలిటికల్ గడ్డను హీటేక్కించే విషయమే!



