బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌ని కాదని మాట్లాడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. అలాగే గత 20 ఏళ్ళుగా తెలంగాణలో కేసీఆర్ మాటే శాసనం… ఆయనే దైవస్వరూపం, అభినవ గాంధీజీ, అభినవ అంబేడ్కర్ వగైరా… వగైరా అన్నట్లు సాగిపోయేది.
తెలంగాణ పట్ల కేసీఆర్‌కు తప్ప మరొకరికి ప్రేమ, నిబద్దత లేవని, రాష్ట్రంలో ఆ మాటకొస్తే యావత్ దేశంలోనే కేసీఆర్ అంత మేధావి, దూరదృష్టిగల రాజకీయ నాయకుడు లేడని బిఆర్ఎస్ శ్రేణులతో చాటింపు వేయించుకున్నారు. పాలాభిషేకాలు చేయించుకున్నారు. తెలంగాణ ప్రజలపై, ప్రభుత్వంపై, పార్టీపై ఇంత పట్టు, ప్రభావం చూపుతున్న కేసీఆర్‌ని ఢీకొనగల మొనగాడే లేడని అందరూ భావిస్తుండేవారు.
ఇందుకు పూర్తి వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొంటూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. అదే గొప్ప అనుకుంటే, తన నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించకుండా, పదవుల కోసం తమలో తాము కుమ్ములాడుకొంటున్న కాంగ్రెస్ నేతలను సైన్యంగా మలుచుకొని తనకంటే వంద రెట్లు బలవంతుడైన కేసీఆర్‌ని ఢీకొన్నారు. ఎన్నికలలో ఓడించి మూల కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
ఈ నేపధ్యంలో ఇద్దరినీ మరోసారి బేరీజు వేసి చూస్తే, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా తెలివైన, బలమైన, మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడని అర్దమవుతుంది. కనుకనే తన ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఊపిరి సలపనీయకుండా ఎదురుదెబ్బ తీస్తున్నారు.
తెలంగాణ ప్రజల ఎదుట రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రయత్నిస్తుంటే, వారు ముగ్గురినే దోషులుగా నిలబెట్టి చూపుతున్నారు.
వారి ప్రతీ ఎత్తుకీ వెంటవెంటనే రేవంత్ రెడ్డి పైఎత్తులు వేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం కృష్ణ జలాలను ఏపీకి దోచిపెడుతోందని, ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేసి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని హరీష్ రావు శాసనసభలో చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు చాలా ధీటుగా చెప్పారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే శాసనసభకు వచ్చి ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తున్నారు.
కేసీఆర్ నేడు నల్గొండ సభలో రేవంత్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు సిద్దమవుతుంటే, రేవంత్ రెడ్డి కూడా తన మంత్రులు, మీడియాని వెంటబెట్టుకొని, కేసీఆర్ గొప్పగా చెప్పుకున్న లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని క్రుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజి పరిశీలనకు బయలుదేరారు. క్రుంగిన ఆ బ్యారేజీని మీడియా ద్వారా ప్రజలకు చూపించి, కేసీఆర్ ఎంత అవినీతికి పాల్పడ్డారో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివరించబోతున్నారు. అంటే ‘టిట్ ఫర్ టాట్’ అన్నమాట!
కృష్ణా జలాలు, ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి, మంత్రులు శాసనసభలోనే జవాబులు చెప్పారు. కానీ మేడిగడ్డ బ్యారేజి క్రుంగిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి రేవంత్ రెడ్డి, మంత్రులు అడుగుతున్న ప్రశ్నలకు కేసీఆర్, హరీష్ రావు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎదుర్కొంటున్న తీరుని చూస్తున్న తెలంగాణ ప్రజలు సైతం ‘ఇన్నేళ్ళకు కేసీఆర్‌కు సరైనోడు తగిలాడు,’ అని అనుకుంటున్నారు.
నిజమే కదా? ఒకవేళ రేవంత్ రెడ్డి కాక మరొకరు ముఖ్యమంత్రి అయ్యుంటే, ఈపాటికి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేవారేమో?




