జగన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఎటువంటి పాలన పరమైన అనుభవం లేకుండా తొలిసారి ముఖ్యమంత్రులుగా అవకాసం పొందినవారే. అయితే ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద్రాబాద్ లో నిర్వహించే “గ్లోబల్ సమ్మిట్” తో తెలంగాణ బ్రాండ్ వాల్యూ ని రెట్టింపు చేసే పనిలో ఉంటే,
2019 ఏపీ సీఎం గా జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ని ముంపు ప్రాంతమంటూ “గ్లోబల్ ప్రచారం” చేసి ఏపీ బ్రాండ్ వాల్యూ ని దిగజార్చారు. నేడు రేవంత్ తన తొలి ముఖ్యమంత్రి అనుభవాన్ని రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, రాష్ట్ర ఆర్థిక పురోగతికి వినియోగిస్తే,
నాడు జగన్ ముఖ్యమంత్రి తన తొలి అనుభవాన్ని మూడు ముక్కలాటకు, రాజకీయ కక్ష్య సాధింపులకు వినియోగించారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటూ రేవంత్ ముందుకొస్తే అమరావతి కూల్చివేతలో ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ని దెబ్బ కొట్టారు జగన్.
జగన్ ప్రజా సమస్యలను వినిపించే ప్రజావేదిక కూల్చివేత తో పాలన మొదలుపెడితే, రేవంత్ ప్రజలకు అనుమతి లేని ప్రగతి భవన్ ఇనుప సంకెళ్లను బద్దలుకొట్టి పాలనలో తన మొదటి అడుగు వేశారు.
ఈ ఇద్దరికీ ముఖ్యమంత్రిగా ఇది తొలి అనుభవమే అయినా జగన్ తన ఐదేళ్ల ప్రభుత్వంలో ఎన్నడూ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించలేకపోయారు. కానీ రేవంత్ మాత్రం తనకు పదవి వచ్చిన రెండేళ్ల లోపే తెలంగాణకు అత్యంత ప్రతిష్టాత్మక సదస్సుని గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఏర్పాటు చేసారు.
జగన్ రాష్ట్ర ప్రయోజనాల కన్నా ప్రత్యర్థి పతనానికే పంతం పట్టారు. రేవంత్ ప్రత్యర్థుల మీద రాజకీయ కక్ష్య సాధింపుల కన్నా రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నడుంబిగించారు. జగన్ దృష్టిలో పాలన అంటే సంక్షేమ పథకాల పంపకాలు దానికే బటన్ నొక్కే కార్యక్రమాలు నిర్వహించి వై నాట్ 175 అంటూ నినదించారు.
పాలన అంటే కేవలం సంక్షేమం మాత్రమే కాదని, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి, ఉపాధి ఏర్పాటు, ఉద్యోగాల కల్పన అంటూ అడుగులేస్తున్నారు రేవంత్. వందల మంది సలహాదారులు, వేలమంది ఐ ప్యాక్ సభ్యులతో రాజకీయం వైసీపీ విధానం అయితే అధిష్టాన నిర్ణయాలకు తన అభిప్రాయాలు జోడించి ఇటు పార్టీలో అసంతృప్తి లేకుండా ప్రజలలో వ్యతిరేకత రాకుండా చేయడం రేవంత్ ఆలోచనగా కనిపిస్తుంది.
గ్లోబల్ సమ్మిట్ తో రేవంత్ హైద్రాబాద్ ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, వైసీపీ గ్లోబల్ ప్రచారంలోకి సన్ రైజ్ సిటీగా గుర్తింపు పొందిన అమరావతిని సన్ సెట్ సిటీగా మార్చేశారు. అయితే ఇద్దరు గ్లోబల్ స్టార్సే కానీ రేవంత్ ది రాష్ట్ర అభివృద్ధికి మార్గం చూపితే జగన్ ది రాష్ట్ర తిరోగమనానికి బాటలు వేసింది.




