తెలంగాణలో పవర్ ప్లే స్టార్ట్… ఎవరి ఎమ్మెల్యేలను ఎవరు లాగేస్తారో?

KCR Revanth Reddy

తెలంగాణలో 119 సీట్లకు 64 సీట్లను గెలుచుకొని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకి 60 మంది సరిపోతారు. కానీ నిలకడగా సాగాలంటే మాత్రం కనీసం మరో 10-15 మంది అవసరమే. లేకుంటే ఎవరికి కోపం వచ్చిన ప్రభుత్వం పడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.

బహుశః అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం 6-12 నెలలకు మించి అధికారంలో కొనసాగలేదని, ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ప్రభుత్వం పడిపోతుందని బిఆర్ఎస్ పార్టీ వాదించింది. అది నిజమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలను చేజారిపోకుండా కాపాడుకొంటూనే, బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ప్రయత్నించక తప్పదు.

ADVERTISEMENT

ఒకవేళ తాము ప్రజాస్వామ్యం, నైతిక విలువలు అంటూ కేసీఆర్‌ని ఉపేక్షిస్తే ఆయన తెర వెనుక పావులు కదుపుతూ తన ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారం కైవసం చేసుకొనేందుకు తప్పక ప్రయత్నిస్తాని రేవంత్‌ రెడ్డికి బాగా తెలుసు.

కనుక ఆనాడు బిఆర్ఎస్‌ పార్టీకి ఎదురే లేకుండా చేసుకోవడానికి కేసీఆర్‌ కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను తన పార్టీలోకి ఫిరాయింపజేసుకొని వాటిని ఏవిదంగా నిర్వీర్యం చేశారో, ఇప్పుడు రేవంత్‌ రెడ్డి కూడా అదేవిదంగా బిఆర్ఎస్‌ పార్టీని నిర్వీర్యం చేసేందుకు గట్టిగా ప్రయత్నించకమానరు.

అయితే కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం కీచులాడుకొంటూ ఏదో రోజు తమ ప్రభుత్వాన్ని తామే కూలదొసుకొని తన వద్దకే వస్తారని కేసీఆర్‌ తాపీగా ఎదురుచూస్తున్నారనే భావించవచ్చు. కానీ ఆలోగా రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోకుండా కాపాడుకోవలసి ఉంటుంది.

అలాగే కాంగ్రెస్‌కు మద్దతు కూడగట్టుకొనేందుకు, హైదరాబాద్‌ నగరంలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు మజ్లీస్‌ పార్టీని కూడా రేవంత్‌ రెడ్డి ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ మజ్లీస్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు అంగీకరిస్తే మంచిదే లేకుంటే దాని వైపు నుంచి కూడా ఊహించని కొత్త సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కనుక మజ్లీస్‌ పార్టీ చేజారిపోకుండా, కాంగ్రెస్‌తో చేతులు కలపకుండా కేసీఆర్‌ జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

కనుక తెలంగాణలో అసలైన పవర్ ప్లే ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు. ఈ పవర్ ప్లేలో మొదట ఎవరు బౌలింగ్ మొదలుపెడతారు?ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారు?చివరికి ఈ 5 ఏళ్ళ పోలిటికల్ మ్యాచ్‌లో రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌లో ఎవరు గెలుస్తారో రాబోయే రోజుల్లో చూస్తాము.

ADVERTISEMENT
Latest Stories