తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌ని మించిన రాజకీయ మేధావి లేరని చెప్పుకునేవారు. కానీ అది ఒకప్పటి మాట! ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చావుదెబ్బ కొట్టి కేసీఆర్ కంటే ఘనుడు అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి. చివరికి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాలేని పరిస్థితి కూడా కల్పించారు.
అయినా రేవంత్ రెడ్డి రాజకీయాలను కేసీఆర్, కేటీఆర్ అర్థం చేసుకోలేకపోయారు లేదా తక్కువ అంచనా వేశారు. అందువల్లే ఆయన ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని అహంభావం ప్రదర్శించారు. కానీ రేవంత్ ప్రభుత్వం దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. పైగా ఆయన బీఆర్ఎస్‌ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు.
రేవంత్ రెడ్డి రాజకీయాలకు బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించడం రెండు ప్రధాన ఉదాహరణలు. తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్‌ని ఆ సెంటిమెంట్ నుంచి వేరు చేయడానికి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయాన్ని తెరపైకి తెచ్చారని చెప్పవచ్చు. ఇది కూడా వ్యూహాత్మక నిర్ణయమే.
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా రేవంత్ మరోసారి తన రాజకీయ చతురత ప్రదర్శించారు. తద్వారా బీజేపీ, బీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టి ప్రజల్లో తమ ప్రభుత్వం, పార్టీ పట్ల వ్యతిరేకత పెరగకుండా చూసుకున్నారు. అదే సమయంలో కేసీఆర్‌ని అరెస్ట్ చేస్తే వచ్చే సానుభూతి కూడా బీఆర్ఎస్‌కి దక్కనివ్వలేదు.
కేసీఆర్‌ని మోడీకి అప్పగించిన రేవంత్ కేటీఆర్ (ఎఫ్-1 రేసింగ్ కేసు)ని మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. ఇది కూడా ఆయన రాజకీయ తెలివికి మరో నిదర్శనం. ఈ కేసులో ఏసీబీ నివేదికను గవర్నర్‌కి ఇచ్చి అనుమతి తీసుకున్న తర్వాత కేటీఆర్‌పై ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నారు.
కాళేశ్వరం కేసుపై సీబీఐ ఎప్పుడు విచారణ మొదలు పెడుతుందో తెలియదు. కానీ ఎఫ్-1 కేసు రేవంత్ చేతిలోనే ఉంది కనుక ముందుగా కేటీఆర్‌ని లోపల వేయగలరు. తద్వారా ముఖ్యమంత్రి అవుతాడని భావించిన కొడుకు జైలుకి వెళ్తే కేసీఆర్ పితృహృదయం ముక్కలవుతుంది.
ఇప్పటికే కవిత వ్యవహారం, పలు కేసులతో బీఆర్ఎస్ పార్టీ తారుమారైపోయింది. కేసీఆర్ మానసికంగా బలహీనపడితే పార్టీకి పూర్తిగా ముగింపు వచ్చే అవకాశం ఉంది. అపర చాణక్యుడనుకున్న కేసీఆర్, తిరుగులేదనుకున్న బీఆర్ఎస్‌ని సీఎం రేవంత్ వ్యూహాలతో మట్టికరిపించబోతున్నట్లే కనిపిస్తోంది.




