తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తుంటుందని అందరికీ తెలిసిందే. కనుక నవంబర్ 30న జరుగబోయే శాసనసభ ఎన్నికలలో కూడా తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉంది.
బీజేపీ గుజరాత్ పార్టీ అని, కాంగ్రెస్ ముసుగులో మళ్ళీ ఆంధ్రా నాయకులు వస్తున్నారని కనుక ఈ బయట శక్తుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, అందుకోసం మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలని కేసీఆర్, కేటీఆర్ తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి లబ్ధిపొందుతుంటుందని కాంగ్రెస్, బీజేపీలకు బాగా తెలుసు. అందుకే దానికి అటువంటి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని, కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని వారి అవినీతిని ఎండగడుతున్నాయి.
కానీ గురువారం పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి నోరు జారారు. “సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్ బిర్లా మందిర్. నాంపల్లి దర్గా మెట్ల మీద కూర్చొని బిచ్చమెట్టుకొంటూ ఉండేవారు. కానీ తెలంగాణ చేతికి అందడంతో కేసీఆర్ కుటుంబం లక్షకోట్లు పోగేసుకోగలిగింది. పదివేల ఎకరాలు కబ్జా చేసింది. చివరికి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలో కూడా కేసీఆర్ కుటుంబానికి వాటా ఉంది,” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
“కేసీఆర్ చేతికి తెలంగాణ వచ్చింది గాబట్టి దానిని దోచుకొని భారీగా డబ్బు, ఆస్తులు పోగేసుకొన్నారని లేకుంటే వారింత ధనవంతులు కాలేరని,” రేవంత్ రెడ్డి చెప్పాలనుకొన్నట్లు అర్దమవుతూనే ఉంది.
అయితే రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ యావత్ తెలంగాణ ప్రజలకు ఆపాదిస్తూ, “మనమందరం పోరాడి తెలంగాణ సాధించుకొంటే, సోనియా గాంధీ మనకు బిచ్చమేసిన్నట్లు తెలంగాణ ఇచ్చిందట. ఒకవేళ ఆమె తెలంగాణ ఇవ్వకుంటే మనమంతా నాంపల్లి దర్గా, బిర్లా మందిర్ మెట్ల మీద బిచ్చమెత్తుకొనేవారిమట!
కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలలో తెలంగాణ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీయే ఈవిదంగా తెలంగాణ ప్రజలని కించపరుస్తూ, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మాట్లాడుతుంటే మౌనంగా భరిద్దామా లేక తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న కేసీఆర్‌కు అండగా నిలబడదామా?” అని ప్రశ్నించారు.




