వైసీపీ ఎమ్మెల్యే మరో మారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం గుప్పించారు. సహజంగా రొటీన్ రాజకీయ విమర్శలను పక్కన పెడితే, ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన పాత నోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ద్వారా చంద్రబాబు నాయుడుకు, ఇతర టిడిపి నేతలకు మరియు బిజెపి వారికి ముందుగానే సమాచారం అందుకున్నారని, దీంతో వారంతా బ్లాక్ మనీని ముందుగానే సర్దుకున్నారని, అందుకనే వారంతా సైలెంట్ గా ఉన్నారని తీవ్ర విమర్శలు చేసారు.
ఒక్కసారి ‘చంద్రబాబు అండ్ కో’కు సమాచారం తెలిసిందో లేదో అన్న అంశం పక్కన పెడితే… రోజా వ్యాఖ్యలను గమనిస్తే… ఆ సమాచారం తమకు కూడా ఇచ్చినట్లయితే మేము కూడా తెల్లధనంగా మార్చుకునేవారము కదా… అప్పుడు ఈ విమర్శలు చేసేవారము కాదు కదా… అనే రీతిలో స్పందించడం విశేషం. సహజంగా మంచి వాక్చాతుర్యం రోజా సొంతం. కానీ, నల్లధనంపై బాబుపై మండిపడుతూ రోజా టంగ్ స్లిప్ కావడం అంటే… టిడిపి నేతలు ఆరోపిస్తున్నట్లు జగన్ నేలమాళిగళలో నోట్ల కట్టలు దాగి ఉన్నాయా? ఆ ఆవేదనే రోజా రూపంలో ఇలా బయటపడుతోందా? లేక రోజా వ్యక్తిగతంగా ఏమైనా కూడబెట్టిందా? అన్న రీతిలో టిడిపి వర్గం చలోక్తులు విసురుతున్నారు.
బహుశా తన వ్యాఖ్యలలోని ఆంతర్యం అర్ధమైందో ఏమో గానీ, ఇలాంటి విమర్శలు వస్తాయని గమనించిన రోజా, మళ్ళీ దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసారు. “తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వద్ద అసలు నల్లధనం అనేది లేదని” కుండబద్దలు కొట్టినట్లుగా వ్యాఖ్యానించారు. టిడిపి నేతలే గత రెండున్నర్ర సంవత్సరాలుగా విదేశాలకు వెళ్లి బ్లాక్ మనీని తెల్లధనంగా మార్చుకోచ్చారని ఆరోపణలు గుప్పించారు. అయితే రోజా ఎంతగా కవర్ చేసుకున్నప్పటికీ, ఒక్కసారి టంగ్ స్లిప్ అయిన తర్వాత సందేహాలు లేవకుండా ఉంటాయా? అసలే అక్రమాస్తుల కేసులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీజ్ లతో నిండా మునిగిపోయి ఉన్న జగన్ వద్ద నిజంగానే రోజా చెప్పినట్లు నల్లధనం అసలు లేదంటారా? ఉందంటారా



