విశాఖలో తెల్ల ఏనుగు… దీనికి ఆకలి ఎక్కువ!

rushikonda-palace-Vizag

అవును తెల్ల ఏనుగే! దేవతల రాజు ఇంద్రుడు వాహనం ఐరావతం (తెల్ల ఏనుగు) అని పురాణాలలో చెపుతారు. కానీ ఇప్పుడు విశాఖలో అంతకంటే పెద్ద తెల్ల ఏనుగు ఉంది. దీనికి ఆకలి కూడా బాగా ఎక్కువే నెలకు సుమారు రూ.25 లక్షలు చొప్పున ఏడాదికి రూ.2.40 కోట్లు ఖర్చు చేస్తేగానీ తెల్ల ఏనుగు ఆకలి తీరడం లేదు. అదేంటి మేము విశాఖలోనే ఉంటున్నాము కదా? మేము తరచూ విశాఖకి వచ్చి పోతుంటాము కదా? కానీ మేమెప్పుడూ తెల్ల ఏనుగుని చూడలేదే? ఇంతకీ దానిని ఎక్కడ బందించి ఉంచారు? జూ లోనా లేక రహస్య ప్రాంతంలోనా?అని అప్పుడే సందేహాలు వద్దు. ఆ తెల్ల ఏనుగు రెండేళ్ళుగా రుషికొండపైనే ఉంది. కొండ కింద నుంచి చాలా స్పష్టంగా కనపడుతుంటుంది. అదే గత ప్రభుత్వం హయంలో జగన్‌ తన నివాసం కొరకు రూ.450 కోట్లు పైగా ఖర్చు చేసి నిర్మించుకున్న విలాసవంతమైన ప్యాలస్‌లు!

వాటిలో ఫ్లోర్ టైల్స్‌, లెట్రిన్ కమోడ్స్, ఫర్నీచర్ ప్రతీ వస్తువు లక్షలు కోట్లు ఖరీదు చేసేవే. అటువంటి ఖరీదైన గృహోపకరణాలతో నిండిన విలాసవంతమైన ఆ ప్యాలస్‌లు తెల్ల ఏనుగులా ముట్టుకుంటే మాసిపోతాయి. ఈ ఏడాదిన్నరలోనే దానిపై సుమారు రూ.3.50 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.

ADVERTISEMENT

ఇదివరకు రుషికొండపై ఉన్న పర్యాటక శాఖ కాటేజీల ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.7 కోట్లు వరకు ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఈ తెల్ల ఏనుగు కూడా ఉపయోగపడకపోయినా ముప్పూటలా తిండి పెట్టక తప్పడం లేదు. గుదిబండగా మారిన వీటిని ఏవిదంగా ఉపయోగించుకోవాలా అని ప్రభుత్వ పెద్దలు తల పట్టుకున్నారు.

ఇప్పటికే సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రుషికొండ ప్యాలస్‌లను సందర్శించారు. కానీ ఏమీ చెప్పలేక పోయారు. దీనిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ముగ్గురు మంత్రుల కమిటీ కూడా దీనిపై ఎటువంటి సూచన చేయలేకపోయింది.

దీంతో ఈ తెల్ల ఏనుగుని ఎలా వాడుకుంటే ప్రభుత్వానికి ఈ భారం తగ్గి దాని నుంచి తిరిగి ఆదాయం పొందగలదు?అని ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక అధారిటీ సీఈవో ఆమ్రపాలి ఓ ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర ప్రజలు తమ సలహాలు, సూచనలను rushikonda@aptdc.inకు ఈ మెయిల్ చేయాలని దానిలో పేర్కొన్నారు. ప్రజల సూచనలన్నిటినీ పరిశీలించి వాటిలో అత్యుత్తమైన సలహా లేదా మెజార్టీ ప్రజల సలహాను అమలుచేస్తామని ఆమ్రపాలి చెప్పారు. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం?

ADVERTISEMENT
Latest Stories