ఇద్దరు అతివలు – అయ్యప్ప… మధ్య 200 మీటర్ల దూరం. పది నిమిషాల్లో స్వామి దర్శనం. కానీ మధ్యలో భక్త సముద్రం అడ్డు. సుమారు 20 వేల మంది అయ్యప్ప భక్తులు అడ్డుగా నిలబడి, పోలీసులను ముందుకు ఒక్క అడుగు కూడా కదలనీయని వేళ, అంతవరకూ రక్షణగా వచ్చిన పోలీసులు, ఇద్దరు యువతులనూ శబరిమలలోని పోలీసు కార్యాలయంలోకి తరలించారు. అక్కడ వారిద్దరితో ఐజీ శ్రీజిత్ మాట్లాడుతున్నారని తెలుస్తోంది.
[m9ad]
ఇంతమంది భక్తుల నిరసనల నడుమ తాము ఆలయానికి వారిని చేర్చలేమని ఇద్దరు యువతులకు శ్రీజిత్ నచ్చజెపుతున్నట్టు సమాచారం. కానీ ఎట్టి పరిస్థితులలో తమకు అయ్యప్ప దర్శనం చేయించాలని వారిద్దరూ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో పక్కన శబరిమలలో అయ్యప్ప దర్శనానికి వెళ్లిన యువతి ఇంటిని నిరసనకారులు సర్వనాశనం చేశారు.
వందలాది మంది నిరసనకారులు, ముఖ్యంగా మహిళలు, ఎర్నాకులంలోని రెహ్నా ఫాతిమా ఇంటిపై పడి, బీభత్సం చేసినట్టు తెలుస్తోంది. తాను శబరిమలకు వెళుతున్నానని సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు వైరల్ కావడం, ఆపై పోలీసు బందోబస్తు మధ్య ఆమె ఆలయం దగ్గరికి వెళ్లినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో వందలాది మంది ఆ ఇంటిని చుట్టుముట్టి ధ్వంసం చేశారు. ఇంట్లోని వారందరినీ బయటకు గెంటేశారు. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి వచ్చేలోపే, గృహోపకరణాలన్నీ ధ్వంసం అయ్యాయని తెలుస్తోంది.



