వైసీపిలో రెండో స్థానంలో ముగ్గురున్నారు. వారిలో సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఒకరు. సాధారణంగా ఆయన వివేకా హత్య కేసు గురించి మాట్లాడేందుకు లేదా జగన్ భజన చేస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను విమర్శించేందుకు మాత్రమే ఎప్పుడైనా మీడియా ముందుకు వస్తుంటారు.
వివేకా హత్య కేసు అటక మీద భద్రంగా ఉంది కనుక ఇప్పుడు దాని గురించి మాట్లాడక్కరలేదు. కనుక నిన్న రెండో ‘సబ్జక్ట్’ మాట్లాడారు.
ఆయన చంద్రబాబు, పవన్‌లను విమర్శిస్తుంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డిని, వైసీపిని, తమ ప్రభుత్వాన్ని స్వయంగా వేలెత్తిచూపుతున్నట్లు ఉండటం విశేషం.
చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారు కనుకనే జైలుకి వెళ్ళారని, కానీ కుంటిసాకులతో బెయిల్‌పై బయటకు వచ్చారని సజ్జల ఎద్దేవా చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా చంచల్‌గూడా జైలుకి వెళ్ళి వచ్చారు కదా?జైల్లో ఏకంగా 16 నెలలు గడిపారు కదా?
ఆయన కూడా పదేళ్ళుగా బెయిల్‌పైనే బయట ఉన్నారు కదా?అంటే తమ అధినేత జగన్ కూడా అవినీతికి పాల్పడటం వలననే జైలుకి వెళ్ళారని సజ్జల చెపుతున్నట్లే కదా?
సిద్దం సభలకు వస్తున్న జనాలను చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఎంత జనాధరణ ఉందో అర్దమవుతుందని సజ్జల అన్నారు. సిద్దం సభలకు జనసమీకరణ చేయడానికి వైసీపి నేతలు, వాలంటీర్లు ఎన్ని తిప్పలు పడుతున్నారో సోషల్ మీడియాలో వీడియోలని చూస్తే అర్దమవుతుంది.
సంక్షేమ పధకాలతో ప్రజలకు ‘మేలు’ చేస్తున్నామని జగన్, సజ్జల చెప్పుకుంటుంటే, సిద్దం సభకి రాకపోతే సంక్షేమ పధకాలు నిలిపేస్తామని వైసీపి నేతలు, వాలంటీర్లు లబ్ధిదారులను బెదిరిస్తుంటారు. వారి ఫోన్ సంభాషణలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఒకవేళ ఈ ఏర్పాట్లు ఏమీ చేయకుండా ఒక్కసారి జగన్ సభ నిర్వహిస్తే ఎంత మంది వస్తారో సజ్జలకే బాగా తెలుసు.
‘చొక్కా మడత పెట్టి’ ‘యుద్ధానికి సిద్ధం’ కావాలని జగన్ వైసీపి కార్యకర్తలకు చెపుతున్నారు. రాప్తాడు సిద్ధం సభలో ఓ జర్నలిస్టుని వైసీపి కార్యకర్తలు రక్తం కారేలా చితకొట్టారు. జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని సజ్జల చెప్పుకున్నారు. ఇందుకే కదా?
ఆనాడు కురుక్షేత్ర యుద్దంలో కర్ణుడుని ‘నేనే దగ్గరుండి గెలిపిస్తానని’ చెప్పిన శల్యుడు రధ సారధ్యం చేస్తే చివరికి ఏమైందో అందరికీ తెలుసు. ఇప్పుడు సజ్జల కూడా జగన్‌కు శల్యసారధ్యమే చేస్తున్నారు.
ఓ పక్క ప్రమాదం ముంచుకొస్తున్నా జగన్‌ను హెచ్చరించి అప్రమత్తం చేసే బదులు, మనకు తిరుగేలేదని ఆయన కళ్లకే గంతలు కట్టి యుద్ధానికి తీసుకువస్తున్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి!




