ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు వైసీపీని ‘గొడ్డలి పార్టీ’ అంటూ ర్యాగింగ్ చేస్తుంటే, ఆ పార్టీ నేతలు దీనికి సమాధానం చెప్పుకోలేక ఇన్ని రోజులుగా సతమతమవుతున్నారు. కానీ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి వారందరికీ ఓ అద్భుతమైన పరిష్కారం కనిపెట్టి చెప్పారు.
నేడు తాడేపల్లి ప్యాలస్‌లో సజ్జల నేతృత్వంలో వైసీపీ నేతలు సమావేశమై రెండు రోజుల పాటు జరిగిన మహానాడు సమావేశాలపై ‘రివ్యూ రిపోర్ట్’ తయారు చేశారు.
వైసీపీని తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే మహానాడు సమావేశాలు నిర్వహించుకున్నారని మూడు ముక్కలో సజ్జల తేల్చిపడేశారు.
తర్వాత ‘గొడ్డలి పార్టీ’ని చక్కగా విశ్లేషించి కొత్త అర్థం చెప్పారు.
ఏమన్నారో ఆయన మాటల్లోనే, “అవును. నిజంగా జగన్మోహన్ రెడ్డి గొడ్డలే. చంద్రబాబు నాయుడుకి ఆయన గొడ్డలి మాదిరిగానే కనపడతారు. రాజకీయంగా ఆయన ప్రాణం తీయగల శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డిగారికే ఉంది. ఆయన రాజకీయ జీవితాన్ని అంతం చేసి సమాధి కట్టగల ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగారే. కనుక చంద్రబాబు నాయుడు పాలిట జగన్ గొడ్డలి వంటివారే. అందుకే అయనకు జగన్ గొడ్డలిలా కనిపిస్తారు తప్ప పూల దండలా కనబడరు కదా?” అని అద్భుతమైన లాజిక్ తీసి ఇచ్చారు.
సజ్జల రామకృష్ణారెడ్డి తమ అధినేత జగన్‌ని వెనకేసుకు వస్తున్నట్లే మాట్లాడినా, సిఎం చంద్రబాబు నాయుడు, టీడీపి నేతలు గొడ్డలి పార్టీ తమదేనని అంగీకరించినట్లనిపిస్తుంది.
చంద్రబాబు నాయుడు బీపీ పెరిగి గుండెపోటుతో చనిపోతారని జగన్ అంటే “రాజకీయంగా ఆయన ప్రాణం తీయగల శక్తి” ఒక్క జగన్మోహన్ రెడ్డిగారికే ఉందని సజ్జల అన్నారు.
గొడ్డలి గురించి మాట్లాడితే అందరికీ వైఎస్ వివేకా దారుణ హత్య కళ్ళ ముందు మెదులుతుందని టీడీపికి అర్దమైంది కానీ సజ్జలకి అర్ధమైనట్లు లేదు. వైసీపీ నేతలు, కార్యకర్తలు సజ్జల చెప్పిన ఈ మాట పట్టుకొని ‘అవును మా జగనన్న గొడ్డలే,’ అని చెప్పుకోవడం మొదలుపెడితే.. అది ప్రజలకు ఎలా వినబడుతుంది? అని ఒకసారి ఆలోచిస్తే అర్దమయ్యేది.




