
ప్రీ రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో పిచ్చెక్కించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా, రిలీజ్ అయిన తర్వాత కూడా అదే ఊపును కొనసాగిస్తూ ‘అనిల్ రావిపూడి అండ్ కో’ చెలరేగిపోతున్నారు. పండగకు విడుదలైన మూడు సినిమాలలో క్లీన్ కమర్షియల్ సక్సెస్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న మూవీకి మళ్ళీ లేటెస్ట్ ప్రమోషన్స్ తో మూవీ టీమ్ ముందుకొచ్చింది.
సినీ ఈవెంట్ లకు బ్రాండ్ అంబాసిడర్ యాంకర్ గా మారిన సుమతో ఇంటర్వ్యూ ని ప్రత్యేకంగా ప్లాన్ చేసారు అనిల్ రావిపూడి. ఎప్పుడూ ఏదొక సెట్ లో ఇలాంటి ఇంటర్వ్యూలను షూట్ చేయడం పరిపాటి కాగా, అనిల్ మాత్రం సుమ ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూని సెట్ చేసి వీక్షకులను ఆకట్టుకున్నారు. ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వ్యూ సంగతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…
హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు, మూవీ అసలు హీరోగా మారిన బుడ్డోడు బుల్లి రాజు పాల్గొన్న ప్రమోషన్స్ కూడా ప్రేక్షకులలోకి బాగా వెళ్ళింది. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందని అక్కడితో వదిలేయకుండా చిత్ర యూనిట్ ఇంకా ప్రమోషన్స్ చేస్తుండడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం.
ఇటీవల కాలంలో ఈ తరహా వినూత్నమైన ప్రమోషన్స్ ఇచ్చిన సినిమా మరొకటి లేదు. దీనికి దర్శకుడు అనిల్ రావిపూడికి పూర్తి క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే. వరుసగా 8 సక్సెస్ లు సాధించిన దర్శకుడిగా ఖ్యాతినందుకున్న అనిల్, ఈ సక్సెస్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయారు. వెంకీతోనే ఈ రేంజ్ సక్సెస్ సాధిస్తే, మెగాస్టార్ తో చేయబోయే తదుపరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న ఊహాగానాలు ఇండస్ట్రీలో అప్పుడే మొదలయ్యాయి.