
ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలలో సంక్రాంతి గేమ్ లో మహారాజ్ గా నిలిచిన బాలయ్య డాకు, వెంకీ సంక్రాంతికి సినిమాలలో అటు నటీనటులతో పాటుగా ఆ సినిమాలో నటించిన ‘చైల్డ్ ఆర్టిస్టులకు’ కూడా మంచి గుర్తింపు దక్కింది.
డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణ తో పాటుగా స్క్రీన్ షేర్ చేసుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ వేద అగర్వాల్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వైష్ణవి పాత్రలో మెరిసిన ఈ చిన్నారి మూవీలో అత్యంత కీ రోల్ లో నటించింది. బాలకృష్ణ, వైష్ణవి మధ్య వచ్చే ప్రతి సన్నివేశంలోను బాలయ్యతో పోటీ పడి మరి తన నటన ప్రావీణ్యాన్ని బయటపెట్టింది వేద.
అటు సెంటిమెంటల్ సీన్స్ లోను, ఇటు ఎమోషన్ ఎక్సప్రెషన్స్ లోను పాత్రకు తగ్గట్టుగా నటించి మూవీ లో హై లైట్ అయ్యింది ఈ చిన్నారి. తన క్యూట్ నెస్ తో అలరిస్తూనే మరోపక్క ప్రతి నాయకుడు ఎదురుపడినప్పుడు బాలకృష్ణ ను చూసి వెనకడుగు వేస్తూ వైష్ణవి ఇచ్చే పవర్ ఫుల్ లుక్స్ అందరిని కట్టిపడేశాయి.
అలాగే ఇటు వెంకీ సంక్రాంతికి వస్తున్నాం మూవీలో కూడా వెంకటేష్ కొడుకు క్యారెక్టర్ చేసిన రేవంత్ కూడా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. బుల్లిరాజు పాత్రలో ఈ బుడ్డోడు చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లలో చప్పట్లు పడ్డాయంటే అతని మాడ్యులేషన్ ఏ స్థాయిలో వర్క్ అవుట్ అయ్యిందో, అది సినిమాకు ఎంతలా కలిసొచ్చిందో అర్ధమవుతుంది.
Also Read – జగన్ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!
తండ్రి మీద ఉన్న అతి ప్రేమ కు ఓటిటి వెబ్ సిరీస్ల ప్రభావం తోడైతే దాని ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో అనే అంశాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి వినోదాత్మకంగా తెరకెక్కించిన ఈ బుల్లి రాజు పాత్ర మూవీ కే హై లైట్ గా నిలిచింది. అంత చిన్న వయస్సులో ఇంతచక్కని స్లాంగ్ తో మంచి మాడ్యులేషన్ చూపిస్తూ బుల్లిరాజు చెప్పిన ప్రతి డైలాగ్ థియేటర్లో నవ్వులు పూయించింది.
అలాగే వెండితెర మీద బుల్లిరాజు కనిపించిన ప్రతి సారి విజిల్స్ మోత కూడా వినిపించింది. ఇలా ఈ రెండు డాకు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన వైష్ణవి.. వేద, బుల్లి రాజు..రేవంత్ కూడా ఈ సంక్రాంతి హీరోలే అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.