మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకే ఇబ్రహీంపట్నంలో గల ఆయన నివాసానికి 15 మంది ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
అగ్రిగోల్డ్ భూముల వివాదం గురించి అందరికీ తెలిసిందే. వాటిలో అంబాపురంలోని కొన్ని భూములను సీఐడీ అధీనంలో ఉన్నాయి. వాటిపై కోర్టులో కేసు నడుస్తుండగానే జోగి రమేష్ ఆ భూములను కొనుగోలు చేసి విక్రయించిన్నట్లు సమాచారం. ఆ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనిపై వైసీపి స్పందన ఊహించిన్నట్లే ఉంది. “మాజీ మంత్రి జోగి రమేష్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లి సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మొహరింపు గంటలు గడిచినా.. కనీసం ఎందుకొచ్చారో కూడా సమాచారం ఇవ్వని అధికారులు, పోలీసులు కూటమి ప్రభుత్వం తీరుపై జోగి రమేష్, వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం,” అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టింది.
వైసీపి నేతలపై వరుసగా కేసులు నమోదవుతుండటం గమనించినప్పుడు కొన్ని విషయాలు ఆలోచింపజేస్తాయి.
1. నాడు వైసీపి అధికారంలో ఉన్నప్పుడు జగన్ మొదలు పార్టీలో ప్రతీ ఒక్కరూ ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే గుడ్డి భ్రమలో ఉండేవారని అందుకే ధైర్యంగా భూకబ్జాలు, మాఫియాలు, దౌర్జన్యాలు చేసేవారని, ఆ ధైర్యంతోనే చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ చేశారని అర్దమవుతుంది.
2. ఆ గుడ్డి నమ్మకంతోనే ఒకవేళ ఓడిపోతే తమ పరిస్థితి ఏమిటని ఎవరూ ఆలోచించలేదని కూడా అర్దమవుతోంది.
3. కానీ ఓడిపోయారు కనుక నాడు చేసిన పాపాలకు అందరూ మూల్యం చెల్లిస్తున్నారనుకోవచ్చు.
4. మరోవిదంగా చెప్పాలంటే సిఎం చంద్రబాబు నాయుడు వారికి ఈవిదంగా ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తున్నట్లు భావించవచ్చు. ఇప్పటికే పినెల్లి, వల్లభనేనికి గిఫ్ట్ ఇచ్చేశారు. ఇప్పుడు జోగికి కూడా ఇచ్చేసి తర్వాత కొడాలికి గిఫ్ట్ సిద్దం చేస్తున్నారు. జగన్ భాషలో ఇది ‘సహజ న్యాయమే’ కనుక ఇప్పుడు తాపీగా ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు.
5. అయితే వైసీపి నేతలపై ఈ కేసులతో ఆ పార్టీ బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, ఇదే అంశం (రాజకీయ కక్ష సాధింపు చర్యలు)తో వైసీపికి రాజకీయాలు చేసుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది. బహుశః అందుకే ఇంతకాలం ప్యాలస్ గడప దాటని జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖ పర్యటనకి బయలుదేరగలుగుతున్నారని అనుకోవచ్చు.




