తన సినిమాకు తగినంత పబ్లిసిటీ అవుతుందని భావించాడో ఏమో గానీ, “శంభో శంకర” సినిమా విడుదలకు ముందు అనేక సంచలన వ్యాఖ్యలకు నిలయంగా షకలక శంకర్ నిలిచాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ దగ్గరికి వెళ్లి 2 కోట్లు పెట్టుబడి పెడితే 8 కోట్లు వస్తుందని, దిల్ రాజు దగ్గరికి వెళ్లి 3 కోట్లు పెడితే 13 కోట్లు వస్తుందని చెప్పిన వైనం హాస్యాస్పదంగా మారాయి.
అయితే ప్రస్తుతం సినిమా రిలీజ్ అయ్యి రెండు రోజులు గడిచింది. ‘బొమ్మ దారుణంగా ఉందంటూ’ సినీ విశ్లేషకులు తేల్చేసారు, చూసిన అరకొర ప్రేక్షకుల టాక్ ఏమీ ఇందుకు విరుద్ధంగా లేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద షేక్ అవుతుందనుకున్న ‘శంభో శంకర్’ మూవీ, తనను షేక్ చేస్తుందన్న విషయం శంకర్ కు ఈ పాటికే అర్ధమై ఉంటుంది. సినిమా అంటే ఓ జబర్దస్త్ స్కిట్ కాదన్న విషయం కూడా అవగతం అయ్యుంటుంది.
పవన్ కు వీరభక్తుడిగా భావించుకునే శంకర్ వి కేవలం గాలిలో మేడలేనని మొదటి రెండు రోజులు బాక్సాఫీస్ వద్ద వచ్చిన కలెక్షన్స్ చెప్పకనే చెప్తున్నాయి. భక్తుడిగా తన జీవితంలో ఓ క్లారిటీ వచ్చేయగా, తాను దేవుడిగా భావించే వ్యక్తి విషయంలో శంకర్ కు స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఎందుకంటే సినిమా పబ్లిసిటీ కోసం తన దేవుడిని బాగానే వినియోగించుకున్నారుగా!



