కొత్త సినిమాల తొలి ఆట థియేటర్లలో పడంగానే… రివ్యూలు వచ్చేస్తున్న రోజులివి. ఈ రివ్యూల ఫలితం రెండో షో నుంచే ఆ సినిమాలపై పడుతోంది. ఫలితంగా నటీనటులు, దర్శకులు, నిర్మాతలపై వీటి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. తలరాతలు తలకిందులైపోతున్నాయి.
ఈ నేపథ్యంలో, ఫిలిం క్రిటిక్ లకు ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ ఓ సూచన చేశారు. నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన ‘అ’ సినిమా గురించి ట్వీట్ చేసిన ఆయన… ‘అ’ సినిమా ఒక యూనిక్ మూవీ అని తెలిపారు. తెలుగు సినీ చరిత్రలోనే ఇదొక అరుదైన ప్రయత్నమని కితాబిచ్చారు.
ఫిలిం క్రిటిక్ లు ఈ సినిమాను పూర్తిగా చూసి, అర్థం చేసుకుని రివ్యూలు రాయాలని… ఇది తన సిన్సియర్ రిక్వెస్ట్ అని కోరారు. ఒక కాన్సెప్ట్ కోసం ఇంత పెద్ద స్టార్స్ ఒక్కటయ్యారంటే తనకు నమ్మశక్యంగా లేదని చెప్పారు. ఈ చిత్రంలో రవితేజ, నాని, రెజీనా కసాండ్రా, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్ తదితరులు భాగస్వాములయ్యారు.



