ఆంధ్రప్రదేశ్ లోని సినిమా పరిస్థితిపై నాచురల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ కు యధావిధిగా టాలీవుడ్ నుండి పెద్ద స్పందనేమి రాలేదు. ‘బాహుబలి’ ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ మాత్రం నానికి మద్దతు పలుకుతూనే, ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.
కానీ ప్రస్తుతం చెన్నైలో ఉంటూ తెలుగు సినిమాకు సపోర్ట్ చేస్తోన్న హీరో సిద్ధార్థ్ మాత్రం, మరోసారి మంత్రులను ఏకరువు పెట్టే ప్రయత్నం చేసారు. గతంలో కూడా సిద్ధార్థ్ ఓ ఏడెనిమిది ట్వీట్స్ వరుసగా వేసి, సినీ పరిశ్రమ మనుగడపై ప్రశ్నలు వేస్తూ, ‘సేవ్ సినిమా’కు పిలుపునిచ్చారు.
“ప్రేక్షకులకు డిస్కౌంట్ ఇస్తూ టికెట్ ధరలను తగ్గించాలని వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులకు చెప్తున్నా… మీ విలాసవంతమైన జీవితాల కోసం మేమంతా టాక్స్ లు కడుతున్నాము, ఇవి కాకుండా కరప్షన్ ద్వారా సంపాదిస్తున్న కోట్లు… మీరంతా మీ విలాసాన్ని తగ్గించి, మాకు డిస్కౌంట్ లు ఇవ్వండి” అంటూ లాజిక్ తో కొట్టారు.
నాని వ్యాఖ్యలకు పరోక్షంగా మద్దతు పలికిన సిద్ధార్థ్, నాని నటించిన “శ్యామ్ సింగ రాయ్” సినిమాను ధియేటర్లలో చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. చూస్తుంటే ఓ మంచి చిత్రంగా ‘శ్యామ్ సింగ రాయ్’ కనపడుతోందని, చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే అసలు నాని సినిమా చూడడానికి వీలు లేకుండా, ధియేటర్లను స్వచ్ఛందంగా ఓనర్లే మూసివేస్తున్న పరిస్థితి ఏపీలో నెలకొంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా 300 నుండి 350 ధియేటర్లు మూతపడిపోతాయని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాకు కృష్ణా, చిత్తూరు మరియు తూర్పు గోదావరి జిల్లాలలో విడుదల అనేది కష్టతరంగా మారింది. కేవలం కొద్దీ సంఖ్యలో మాత్రమే ఈ మూడు జిల్లాలలో ధియేటర్లు అందుబాటులో ఉండడంతో, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాకు ప్రేక్షకుల ‘మౌత్ టాక్’తో పని లేకుండా పోయినట్లయ్యింది.



