ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస బహిరంగ సభలో ప్రసంగించిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికలు సమీపిస్తున్నందున ఇన్నేళ్లు పట్టించుకోని కడప ఉక్కు పరిశ్రమకు ఆగమేగాలపై శంకుస్థాపనలు చేశారు. చుక్కనీరు కూడా పోలవరం ప్రాజెక్టులో లేకపోయినా గేట్లు బిగింపు పేరుతో హంగామా చేస్తున్నారు. రాజధానిలో ఐదేళ్లలో శాశ్వత భవనం ఒక్కటీ కట్టని ముఖ్యమంత్రి ఇప్పుడు రెండెకరాలలోని బొమ్మ భవనాలను చూపించడానికి బస్సులు వేస్తున్నారు,” అని జగన్ విమర్శించారు.
[m9ad]
మిగతా విషయాలు ఎలా ఉన్నా.. చుక్కనీరు కూడా పోలవరం ప్రాజెక్టులో లేకపోయినా గేట్లు బిగింపు పేరుతో హంగామా చేస్తున్నారు అన్న జగన్ కామెంట్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. “నీళ్లు లేని టైములో కాకుండా ఎప్పుడు గేట్లు బిగిస్తారు? మా జగనన్న అయితే వరద వచ్చినప్పుడు వరద నీటికి అడ్డంగా నిలబడి గేట్లు బిగించేవాడేమో?,” అని ఒక అతను కామెంట్ చేసాడు. ఈ తెలివితో, ప్రాజెక్టులపై ఉన్న జ్ఞానంతో సీఎం అయిపోదామనే అని ఇంకొందరు ఎద్దేవా చేశారు.
మరో వైపు జగన్ పాదయాత్ర చివరి అంకానికి చేరుకుంది. నిన్నటితో 333 రోజులు పాటు జరిగిన పాదయాత్రలో జగన్ 3563 కిలోమీటర్ల మేర నడిచారు. వచ్చే నెల 8..9 తారీఖులలో పాదయాత్ర ఇచ్ఛాపురం నియోజవర్గంలో భారీ బహిరంగ సభతో పూర్తి కాబోతుంది. ఆ వెంటనే దే రోజు వైఎస్ జగన్ తిరుపతికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారని, ఆ మర్నాడు ఉదయమే అతిథి గృహం నుంచి కారులో బయలుదేరి అలిపిరికి చేరుకుంటారని సమాచారం. శ్రీవారి మెట్టుదారిన తిరుమలకు నడిచి వెళ్లి, శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారు.
గత సంవత్సరం పాదయాత్ర ప్రారంభించే ముందు కూడా జగన్ తిరుమల దర్శనం చేసుకున్నారు. పాదయాత్ర చేరని నియోజకవర్గాలలో బస్సు యాత్ర చెయ్యాలని మొదట సంకల్పించినా పాదయాత్ర బాగా ఆలస్యం కావడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టు సమాచారం. ఎన్నికలకు ఐదు నెలలే సమయం ఉండటంతో అభ్యర్థులు ఫైనల్ చేయ్యడంలో ఆయన కొన్ని రోజులు బిజీగా ఉండబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే మలి విడత ప్రచారం మొదలు పెడతారు.



