ఏపీలో విడుదలైన ఎమ్మెల్సీ ల భర్తీ లో టీడీపీ పార్టీ నుండి కావాలి గ్రీష్మ, బీద రవి చంద్ర, బీటీ నాయుడు కి అవకాశం దక్కగా పొత్తులో భాగంగా జనసేన పార్టీ తరపున నాగబాబు, బీజేపీ నుండి సోము వీర్రాజు కి అదృష్టం వరించింది.
అయితే టీడీపీ పార్టీలో పార్టీ కోసం ఎంతో శ్రమించిన, పొత్తు కోసం త్యాగం చేసిన అనేకమంది ముఖ్య నేతలు ఉన్నప్పటికీ వారందరిని పక్కన పెట్టి మరి బాబు ఈ ముగ్గురికి అవకాశం కల్పించడంలో కుల సమీకరణాలు ప్రధాన భూమిక పోషించాయనే చెప్పాలి. అయితే టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే ఇక బీజేపీ అధిష్టానం సోము కు అవకాశం కల్పించడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
గతంలో టీడీపీ పార్టీ మీద, సీఎం చంద్రబాబు మీద నోరుపారేసుకున్న సోము కోసం టీడీపీ ఇంతటి త్యాగం చేయడం అవసరమా.? అనే ఆలోచన పార్టీ క్యాడర్ ను తొలిచేస్తోంది. బీజేపీ కండువాతో వైసీపీ పార్టీ కోసం పని చేసే సోము లాంటి నేతకు ఎమ్మెల్సీ పదవి అంటే అది బీజేపీ బలోపేతానికి కాదు వైసీపీ ఎదుగుదలకు అవకాశం ఇచ్చినట్టే అవుతుంది.
అలాగే జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా గతంలో టీడీపీ పార్టీ మీద, ఆ పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీద అనేక అనుచిత వ్యాఖ్యలు చేసి టీడీపీ తమ్ముళ్ల ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా ఈ ఇద్దరికీ ఎమ్మెల్సీ అవకాశాలు దక్కడంతో తెలుగు తమ్ముళ్లు కాస్త అసహనానికి గురవుతున్న మాట వాస్తవమే.
అయితే ఇందులో పవన్ కోసం నాగబాబు ని ఉపేక్షించినా, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు విషయంలో మాత్రం బీజేపీ తో పాటుగా టీడీపీ మీద కూడా గుర్రుగా ఉన్నారు పలువురు టీడీపీ నేతలు. మరి ఇప్పటికైనా సోము వైసీపీ మీద తనకున్న ప్రేమను, జగన్ మీద తనకున్న స్వామి భక్తిని పక్కన పెట్టి కూటమి కోసం పని చేస్తారా.? లేక వైసీపీ కోసం రాజకీయ రాయబారాలు కొనసాగిస్తారా.?






