ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు అడపాదడపా జగనన్నకు రాష్ట్రానికి సంబందించి వివిద అంశాలపై లేఖలు వ్రాస్తూనే ఉన్నారు. మీ పాలనలో అవినీతి, భూకబ్జాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ అందరూ అనుకొంటున్న విషయాలనే లేఖలలో వ్రాసి పోస్ట్ చేస్తుండేవారు.
కానీ జగనన్న వాటిని చదివిని స్పందించిన దాఖలాలు లేవు. అయినప్పటికీ ఓ ప్రతిపక్ష నేతగా చాలా బాధ్యతగా జగనన్నకు లేఖల ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా మరో బహిరంగ లేఖ వ్రాశారు.
దానిలో ఆయన ఏమి వ్రాశారంటే, ప్రియమైన జగనన్నకు సోమూ వీర్రాజు ప్రేమతో తెలియజేయునది ఏమనగా, రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీకి కేంద్రప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుంటే, ఆ పధకంపై ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ముద్రించకుండా మీ ఫోటో ముద్రించుకోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నాము.
మా సొమ్ముతో రాష్ట్రంలో అమలవుతున్న ఈ పధకాన్ని మీ ప్రభుత్వానిదన్నట్లుగా మీరు ప్రచారం చేసుకోవడం సబబు కాదు. కనుక తక్షణం బియ్యం కార్డుల మీద, బియ్యం పంపిణీ వాహనాల మీద ప్రధాని నరేంద్రమోడీ ఫోటోలను ముద్రించవలసిందిగా కోరుతున్నాను. సంబందిత అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు ఈయవలసిందిగా కోరుతున్నాను,” అని ఆ లేఖ సారాంశం.
అయితే సోమూ వీర్రాజు ఇంత ప్రాయసపడి లేఖ వ్రాసేబదులు ‘జగనన్నకు చెపుదాం’ కార్యక్రమంలో ఫోన్ చేసి ఈ ముక్క చెప్పి ఉంటే రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరించేసినట్లే, దీనిని కూడా పరిష్కరించేసి ఉండేవారేమో?



