ఏపీలో బెయిల్ పై ఉన్న నేతలు త్వరలో జైలుకు!

ఏపీలో బెయిల్ పై ఉన్న నేతలు త్వరలో జైలుకు!‘ప్రజా ఆగ్రహ సభ’ పేరుతో ప్రస్తుత అధికార పార్టీ చేస్తోన్న పరిపాలనను ఎండ కట్టేందుకు నడుం బిగించిన బిజెపి విజయవాడ వేదికగా ఓ సభను నిర్వహించింది. రాష్ట్రంలోని ప్రముఖ బీజేపీ నేతలు కన్నా లక్ష్మి నారాయణ, సోము వీర్రాజు, పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరిలతో పాటు ఢిల్లీ నుండి విచ్చేసిన ప్రకాష్ జవదేకర్ చేసిన ప్రసంగం సంచలనంగా నిలిచింది.

ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని, ఓ పక్కన దేశంలో తాము అయోధ్య రామమందిరం నిర్మిస్తుంటే, ఏపీలో రామతీర్థంలో రాముని విగ్రహం విధ్వంసానికి గురయ్యిందని, అలాగే ఎంతో ప్రాచీన్యం కలిగిన అంతర్వేది రధాన్ని తగలబెట్టారని మండిపడ్డారు.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకమైన అంశాలలో ఒకటైన పోలవరంను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, నిజానికి పోలవరం నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించామని, అయినప్పటికీ పోలవరం పూర్తి కాలేదని అన్నారు.

ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అంటూ ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం, ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు.

పోలీస్, టీచర్ తదితర విభాగాలలో ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేకపోయారని అన్నారు. అలాగే రైతులు చెల్లించే పంట భీమాను కూడా తామే చెల్లిస్తామని చెప్పి, ఇపుడు కట్టడం లేదని, ఏ ఒక్క ప్రామిస్ ను కూడా నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ వేసుకుంటోందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఒక లక్షా అరవై వేల రూపాయలను కేంద్రం కేటాయిస్తుంటే, ‘జగనన్న కాలనీ’ అని పేరు పెట్టుకున్నారని, అది ‘జగనన్న కాలనీ’ కాదని ‘మోడీ కాలనీ’ అని పిలుపునిచ్చారు.

విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడు తాను ప్రవేశపెట్టిన పిల్లలందరికీ యూనిఫామ్ పధకాన్ని ఏపీలో ‘జగనన్నకానుక’గా మార్చేశారని, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమానికి కూడా జగన్ తన పేరు పెట్టేసుకున్నారని, కేంద్రం ఇస్తోన్న నిధులను ఇక్కడ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం తెలుగులో ఓ కొత్త సినిమా “పుష్ప” వచ్చిందని, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తాను చూసానని, ఆంధ్రప్రదేశ్ లో ఈ స్మగ్లింగ్ ను ట్రాక్ చేసేందుకు ఓ ‘సిట్’ టీమ్ ఉందని, దానిని జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు.

ఓ పక్కన మోడీ ప్రభుత్వం అవినీతిని అడ్డుకునే విధంగా బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు పధకాలను అందిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వాలెంటైర్ వ్యవస్థను తీసుకువచ్చి, నేరుగా డబ్బులను ఇంటికి వద్దకు పంపించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది నేతలు బెయిల్ పై ఉన్నారని, వాళ్ళు ఏ సమయంలోనైనా జైలుకు వెళ్లవచ్చంటూ ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ పొలిటిక్స్ లో అత్యంత ప్రాధాన్యతను దక్కించుకున్నాయి.

ADVERTISEMENT
Latest Stories