హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి సాహిత్యం, కళలకు నిలయం. కనుక దాని ఆవరణలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. అది రవీంద్ర భారతికి మరింత గౌరవప్రదమే అవుతుంది.
తన పాటలతో దశాబ్దాల పాటు తెలుగు ప్రజలని మాత్రమే కాదు.. దక్షిణాది రాష్ట్రాల ప్రజలను, తన హిందీ పాటలతో అటు ఉత్తరాది ప్రజలను కూడా అలరించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
ఆయన పాటకు భాషల హద్దులు, భౌగోళిక సరిహద్దులు లేవు. కనుకనే తమిళనాడు ప్రభుత్వం మద్రాసులో ఓ వీధికి ఆయన పేరు పెట్టి గౌరవించింది.
కానీ తెలంగాణ ఉద్యమకారుడు పృద్విరాజ్ రవీంద్ర భారతికి చేరుకొని బాలు విగ్రహం ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. తెలంగాణలో అందెశ్రీ, గద్దర్ వంటి అనేకమంది కవులు ఉండగా ఆంధ్రాకి చెందిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదన్నారు.
ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ఆయనకి నచ్చజెప్పపోతే ఆయనతో వాగ్వాదానికి దిగారు. రవీంద్ర భారతిలో ఆంధ్రా గాయకుడి విగ్రహం పెట్టడానికి వీల్లేదని వాదించారు.
ఇటువంటి వాదనలకు బీజం వేసిన పాపం కేసీఆర్‌దే అని చెప్పక తప్పదు. నాడు ఉద్యమస్పూర్తిని రగిలించేందుకు తాను ఆంధ్రాని బూచిగా చూపిస్తూ ద్వేషిస్తూ మాట్లాడానని ఆయనే ఓ సందర్భంలో చెప్పుకున్నారు.
కానీ ఆయన ప్రజల మనసులలో నాటిన ఆ విద్వేష బీజాలను నేటికీ పెంచి పోషిస్తూనే ఉన్నారు. అందువల్లే నేడు పృద్విరాజ్ వంటివారు ఇటువంటి సంకుచిత వాదనలు చేస్తున్నారని భావించవచ్చు.
ఇటువంటి వాదనలతో కొంతమంది గుర్తింపు సంపాదించుకొని, రాజకీయంగా ఎదగాలని తాపత్రయపడుతుండటం ఇంకా శోచనీయం.
ప్రపంచదేశాలను మెప్పించి, భారత్ కీర్తిని, తెలుగుభాష, తెలుగువారి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన ఘనుడు బాలసుబ్రహ్మణ్యం. ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తే అది ఆ వేదికకి, తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వ కారణమవుతుంది తప్ప తెలంగాణ కవులు, కళాకారులను తక్కువ చేసి చూపినట్లు కాదు.
ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం వద్దనుకుంటే రవీంద్ర భారతి పేరు కూడా మార్చుకోవాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరిట రవీంద్ర భారతిని ఏర్పాటు చేశారు కనుక! అయినా మహనీయులను కూడా సంకుచిత భావంతో చూసే చోట వారి విగ్రహాలు ఏర్పాటు చేయకపోవడమే మంచిది.







