సింహం… అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు చాలా భయపడుతున్నారు. కానీ అలా చెప్పుకోలేరు కనుక తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టనని చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ ఎన్నడూ కోర్టుకి వెళ్ళలేదు కానీ తన హోదా కొరకు హైకోర్టుకి వెళ్ళారు. అవసరమైతే సుప్రీంకోర్టుకి కూడా వెళతారు. కానీ అంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టే ఉద్దేశ్యం లేదని ముందే చెప్పేశారు.
అయితే జగన్ బాధితులలో ఒకరైన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. కనుక ఆయన కూడా తనను ర్యాగింగ్ చేస్తారనే భయం ఉండి ఉండవచ్చు. కానీ అలాంటి భయాలేమీ పెట్టుకోకుండా ధైర్యంగా అసెంబ్లీకి రమ్మనమని అయ్యన్నపాత్రుడు హితవు పలికారు.
ఇప్పుడు మీరు (జగన్) ముఖ్యమంత్రి కాదు. ఎమ్మెల్యే మాత్రమే. కనుక మిమ్మల్ని గెల్పించిన పులిచింతల ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించుకోవలసిన బాధ్యత మీపైనే ఉంది. కనుక అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చలో పాల్గొనాలని కోరుతున్నాను. అసెంబ్లీలో మిగిలిన పార్టీల సభ్యులకి ఎవిదంగా మాట్లాడే అవకాశం ఇస్తున్నానో అదే విధంగా మీకూ కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తాను ఏదో వంకతో అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడం సరికాదు,” అని అన్నారు.
జగన్ తనని తాను సింహాన్ని అని అనుకుంటారు కనుక స్పీకర్ మొదలు ఫ్లోర్ లీడర్ వరకు తన రాజకీయ ప్రత్యర్ధులతో నిండిన అసెంబ్లీ ఆయనకు ఓ బోనులో అడుగుపెడితే దానిలో తనను బందించేసి తనతో ఆడుకుంటారనే భయం జగన్‌కి ఉంది. కనుక అయ్యన్నపాత్రుడు ఎంత ధైర్యం చెప్పినా, ఎంత ప్రలోభపెట్టినా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టకపోవచ్చు. కానీ ప్రజలు దానిని పిరికితనంగా భావించే ప్రమాదం ఉంటుంది కనుక అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతీసారి జగన్ కొత్త కొత్త సాకులతో రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు.




