దాదాపుగా 120 కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కించిన “స్పైడర్” సినిమా అభిమానులకు మరియు ప్రేక్షకులకు తీవ్ర నిరుత్సాహాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని దర్శకుడు మురుగదాస్ తో పాటు హీరో మహేష్ బాబు కూడా వివిధ సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే. ఒక సినిమా ఒప్పుకుంటే ప్రాణం పెట్టి పని చేస్తానని చెప్పిన మహేష్, తమిళ దర్శకుడు మురుగదాస్ ను నమ్మి కూడా ‘స్పైడర్’ కోసం అదే ప్రాణం పెట్టి చేసాడు. కానీ రిజల్ట్ మాత్రం ఆశించినది రాకపోవడంతో ప్రస్తుతం కుటుంబంతో కలిసి తన ఒత్తిడిని తగ్గించుకునే పనిలో ఉన్నాడు.
బాక్సాఫీస్ ను షేక్ చేయలేకపోయిన “స్పైడర్” అసలు మహేష్ కు ఏం మిగిల్చింది? గతంలో ప్రిన్స్ నటించిన “1 నేనొక్కడినే, ఖలేజా, ఆగడు” సినిమాలు కూడా బాక్సాఫీస్ ను ప్రభావితం చేయలేకపోయాయి. కానీ ఆయా చిత్రాలలో మహేష్ నటన కొత్తదనంతో కూడుకుని ఉండడంతో, ఆ సినిమాలపై అభిమానులకు గానీ, ప్రేక్షకులకు గానీ ఇప్పటికీ ఓ క్రేజ్ ఉంది. ‘ఖలేజా’ విడుదలై ఆరేళ్ళు పూర్తయ్యి, ఏడవ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా… ఈ సినిమాకు నీరాజనాలు పడుతూ ట్విట్టర్ లో ఫ్యాన్స్ మోగిస్తున్న మోత మామూలుగా లేదు.
అలా ప్రిన్స్ అభినయం పరంగా కనీసం గర్వంగా చెప్పుకునే విధంగా అయినా “ఖలేజా, 1 నేనొక్కడినే” వంటి సినిమాలు నిలిచాయి. కానీ ‘స్పైడర్’ అలాంటి అవకాశాన్ని కూడా ఇవ్వలేకపోవడం అసలు నిరుత్సాహకరమైన అంశం. అలా అని ఆర్ధికంగా ఈ సినిమా వలన మహేష్ లాభాపడ్డారా? అంటే తాజా ట్రేడ్ టాక్ ప్రకారం అయితే… ‘స్పైడర్’ కోసం తీసుకున్న మొత్తంలో ఎక్కువ భాగం ప్రిన్స్ తిరిగి ఇచ్చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు నష్టాలకు గురి కాని ఓవర్సీస్ లో సైతం ‘స్పైడర్’ భారీ నష్టాలను మిగల్చడంతో, ప్రిన్స్ రెమ్యునరేషన్ లో ఎక్కువ శాతం రిటర్న్ అయినట్లుగా తెలుస్తోంది.
దాదాపుగా ఏడాదిన్నర్ర పాటు సమయం వెచ్చించి చేసిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇది ఒక్క మహేష్ బాబు పరిస్థితే కాదు. ఏ హీరో అయినా తమ సినిమా కోసం అంతే కష్టం పడతారు. సక్సెస్ అయితే ఆ కష్టాన్నంతా మరిచిపోయి, ఉల్లాసంగా గడుపుతారు. లేదంటే ఆ కష్టాన్నే తలచుకుంటూ బాధపడతారు. అయితే కొన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా… మంచి అనుభూతులను మిగులుస్తాయి. కానీ మహేష్ “స్పైడర్” విషయంలో మాత్రం అన్ని యాంగిల్స్ లోనూ నిరుత్సాహకరమైన ఫలితమే అందించింది.


