తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.. తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో మొదట తనకు తాను నిప్పటించుకొని ఆత్మత్యాగం చేసుకున్న అమరుడు ఆయన.. ఆయన బలిదానంతో ఉద్యమం ఉదృతమయ్యింది. కానీ శ్రీకాంతాచారి ఆత్మత్యాగం నిరూపయోగమైపోయిందని ఆయన తల్లి శంకరమ్మ ఆరోపించారు.
యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర నాలుగోవ ఆవిర్భావ వేడుకల్లో తనను మొదట వేదిక మీదకు పిలువకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు శ్రీకాంతాచారి త్యాగాన్ని మరిచిపోయి.. తన కొడుకును అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జోక్యం చేసుకుని.. ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వారి మాట వినకుండా కన్నీటి పర్యంతమై అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర నాలుగోవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.



