బీఆర్ఎస్‌ ఖాతాలో 1400 కోట్లు.. ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చిందే

Kavitha BRS Allegations

ఇంటి గుట్టు లంకకు చేటని ఆనాడే స్పష్టమైంది. కల్వకుంట్ల కవిత వలన బీఆర్ఎస్‌ పార్టీ బండారం బయటపడుతోంది. ఆమె ‘టీఆర్ఎస్‌’ పేరు వాడుకోకుండా బీఆర్ఎస్‌ పార్టీ అడ్డుపడటంతో మళ్ళీ ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. నేడు కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతూ, “నేను పార్టీ పెట్టుకుంటే భయం లేదని చెప్పుకుంది బీఆర్ఎస్‌ పార్టీ, కానీ ఇప్పుడు మాకు ‘టీఆర్ఎస్‌’ కేటాయించడంపై ఈసీకి వెయ్యికి పైగా పిర్యాదులు చేయడం మీ భయానికి నిదర్శనం కాదా?

నేను పార్టీ పెట్టుకొని నా మానాన్న నేను పనిచేసుకుంటుంటే అడుగడుగునా ఎందుకు అడ్డుపడుతున్నారు? మొదట్లో మీ పార్టీ అవినీతి భాగోతాల గురించి చెప్పినప్పటికీ ఆ తర్వాత నేను మీ జోలికి రాలేదు కదా? నేను ఒంటరిగా ప్రజల మద్యకు వెళ్ళి వారి సమస్యల గురించి ప్రభుత్వంతో పోరాడుతుంటే, నాకు సంబంధించిన వార్తలు వేయొద్దని ‘గుంటనక్క’ (హరీష్‌ రావు) అందరికీ ఫోన్లు చేసి చెపుతున్నారు. చివరికి జాతీయ మీడియా ప్రతినిధులకు కూడా ఫోన్లు చేసి చెపుతున్నారు.

ADVERTISEMENT

మీరిద్దరూ (కేటీఆర్‌, హరీష్‌ రావు) మీ పార్టీని నడిపించుకోవడంపై దృష్టి పెట్టకుండా ఆంబోతుల్లా మామీద ఎందుకు పడుతున్నారు? నన్ను అడ్డుకునేందుకు మీరిద్దరూ ఒకసారి కాంగ్రెస్‌ పార్టీతో మరోసారి బిజేపితో చేతులు కలుపుతుంటారు? ఇలాగేనా రాజకీయాలు చేసేది?” అంటూ కల్వకుంట్ల కవిత హరీష్‌ రావు, కేటీఆర్‌లపై నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా కవిత బీఆర్ఎస్‌ పార్టీపై మరో బాంబు పేల్చారు. ”మీ పార్టీ బ్యాంక్ ఖాతాలో ఉన్న1400 కోట్లు క్విడ్ ప్రో పద్దతిలో ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి దండుకున్నవే కదా? ముందు ఆ అవినీతి సొమ్ముని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంచేసి ఆ తర్వాత ప్రజల మధ్యకు రండి. అమీతుమీ తేల్చుకుందాం,” అంటూ సవాలు విసిరారు.

తెలంగాణని ఆంధ్రా పాలకులు దోచుకున్నారని బీఆర్ఎస్‌ పార్టీ నేతలు తరచూ విమర్శిస్తుంటారు. కానీ వారే అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి అందుకు ప్రతిగా ఏకంగా 1,400 కోట్లు పోగేసుకుందని కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా చెపుతున్నారిప్పుడు.

అంటే తెలంగాణ ఏర్పడింది ప్రజల కోసమా లేక బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, కల్వకుంట్ల కుటుంబం కోసమా? వారి అవినీతి భాగోతాలను వారే ఈవిధంగా బయటపెట్టుకుంటూ మళ్ళీ ‘తెలంగాణ రక్షణ సేన’ అని ఒకరు తెలంగాణకు కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ మాత్రమే ‘శ్రీరామరక్ష’ అని మరొకరు చెప్పుకోవడానికి ఏమాత్రం మొహమాటపడరు.

బీఆర్ఎస్‌ పార్టీ 1,400 కోట్లు అవినీతి సొమ్ము పోగేసుకుందని ఇప్పుడు ఆరోపిస్తున్న కవితకు ఈవిషయం అప్పుడే తెలుసు. కానీ అప్పుడు మౌనం వహించిన ఆమె ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుండటం గమనిస్తే, కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నట్లు అవినీతి సొమ్ము పంపకాల కోసమే వారు కీచులాడుకుంటున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories