ఇంటి గుట్టు ఎప్పటికైనా లంకకు చేటే సుమీ….

Sharmila, Kavitha: Are Family Rifts Hurting YSRCP and BRS?

పది తలల రావణుడు కూడా ఇంటి గుట్టు రట్టవడంతోనే నేలకొరిగిన సంగతి తెలిసిందే. సీతా దేవి అపహరణను మొదటి నుంచి వ్యతిరేకించిన రావణ సోదరుడు విభీషణుడు ధర్మం వైపు నిలబడి రావణుడి బలహీనతలు, లంక రహస్యాలు రామునికి అందించాడు.

దానితో శ్రీ రాముని చేతిలో రావణ వద అనివార్యమయింది. ఎంతటి శివ భక్తుడైన, పదితలలు ఉన్నా విభీషణుడు ఇచ్చిన లంక గుట్టు రావణునికి అంతానికి దారి తీసింది. ఇక ఇప్పుడు అలాంటి ఇంటి గుట్టే ఏపీలో షర్మిల వద్ద తెలంగాణలో కవిత వద్ద ఉండడంతో ఇటు వైసీపీ అటు బిఆర్ఎస్ కు రాజకీయ ఎదురుదెబ్బ తప్పేలా కనిపించడం లేదు.

ADVERTISEMENT

2019 ఏపీ ఎన్నికల తరువాత వైఎస్ కుటుంబంలో వచ్చిన విభేదాలు అన్న చెల్లుళ్ళుగా ఉన్న జగన్, షర్మిలను రాజకీయ ప్రత్యర్థులుగా మార్చేశాయి. ఇక 2023 తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత బిఆర్ఎస్ – కవిత మధ్య ఏర్పడిన గ్యాప్ తండ్రి కూతుర్లయిన కేసీఆర్, కవిత ను అన్న చెల్లెళ్లయినా కేటీఆర్, కవిత ను రాజకీయ శత్రువులుగా చేసేశాయి.

2024 ఎన్నికల సమయంలోనే వైసీపీ పులివెందుల రహస్యాలు షర్మిల తో పాటుగా సునీత కూడా బయటపెట్టడంతో వైసీపీ పతనం మొదలయ్యింది. ఇక నాటి నుంచి నేటి వరకు షర్మిల తన వద్ద ఉన్న ఒక్కో సమాచారాన్ని సమయానుసారంగా బయటకు తీస్తూ వైసీపీ ని రాజకీయంగా దెబ్బకొడుతూనే వస్తుంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తి వివాదాల నుంచి అవినాష్ రెడ్డి ఉందాంతాల వరకు వైసీపీ గుట్టు మొత్తం షర్మిల చేతిలో ఉంది. దానితో షర్మిల విభిషణుడి మాదిరి వైసీపీ దహనం చేస్తుందేమో అన్న ఆందోళన ఇప్పటికి జగన్ అండ్ కో వెంటాడుతూనే వస్తుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినా, వేల కోట్ల సంపద ఉన్న, దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నేతగా పేరుపొందిన షర్మిల ఆరోపణల ముందు జగన్ ఎప్పుడు బలహీనుడే అవుతాడు.

ఇక అదే కోవలోకి చేరారు కవిత. తండ్రి స్థాపించిన తెరాస తో తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన కవిత గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో భాగమయ్యింది. ఎంపీ గా ఎమ్మెల్సీ గా బిఆర్ఎస్ పదవులనుభవించిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి బైలు మీద బయటకు వచ్చిన నాటి నుంచి కూడా బిఆర్ఎస్ కు కొంచెం కొంచెం దూరం జరుగుతూ వస్తుంది.

ఆ దూరమే చివరికి బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వరకు వెళ్ళింది, ఆ దూరమే కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భావానికి బాటలు వేసింది. ఇక ఆ దూరమే తండ్రి కేసీఆర్ ని మర మనిషిగా ప్రకటించేలా చేసింది, అన్న కేటీఆర్ పై రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టేలా ప్రోత్సహించింది.

ఇక ఇప్పుడు ఆ దూరమే బిఆర్ఎస్ గుట్టును బయటకు తెచ్చేలా చేస్తుంది. బిఆర్ఎస్ ఖాతాలో ఉన్న 1400 కోట్లు క్విట్ ప్రోకో కింద అంధ్రా కాంట్రాక్టుల ద్వారా పార్టీకి వచ్చిన సొమ్ము కాదా.? అది అవినీతి సొమ్ము కాదా.? ఆ అవినీతి సొమ్ము మొత్తం తెలంగాణ అమరవీరుల కుటుంబానికి పంచండి అంటూ గత పదేళ్ల బిఆర్ఎస్ అవినీతి గుట్టు అంటూ 1400 కోట్లకు సంబంధించిన రహస్యాలను బయటపెట్టింది కవిత.

గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో హరీష్ రావు, సంతోష్ రావు దండిగా దండుకున్నారంటూ హరీష్ ని గుంటనక్కతో పోల్చారు కవిత. అయితే కవిత కేసీఆర్ నుంచి కేటీఆర్, హరీష్, సంతోష్ మొదలుకుని ఆ పార్టీ నేతలను, బిఆర్ఎస్ ప్రభుత్వ విధివిధానాలను, చివరికి బిఆర్ఎస్ పార్టీ ఫండ్ ను కూడా ఇలా బజారున పెట్టినా కేసీఆర్ వర్గం నుంచి కవిత మీద వచ్చే ప్రతిస్పందన, ప్రతి దాడి శూన్యమనే చెప్పాలి.

కవిత బిఆర్ఎస్ కేంద్రంగా, ఆ పార్టీ అధినాయకత్వం టార్గెట్ గా చేసిన విమర్శలకు కేసీఆర్ వర్గం మౌనంగా ఉన్నప్పటికీ ఈ 1400 కోట్ల ఆరోపణల మీద బిఆర్ఎస్ మౌనం వహిస్తే మౌనం అర్ధాంగీకారం అనే భావించాల్సి వస్తుంది సుమీ…! ఇన్నాళ్లు తెలంగాణ ద్రోహులు ఆంద్రోళ్ళు అన్న బిఆర్ఎస్ ఇప్పుడు ఆంధ్రా వాళ్ళ సొమ్ముతో బిఆర్ఎస్ ను నడిపిస్తుందా అన్న ప్రశ్నకు కూడా బదులు చెప్పాల్సి ఉంటుంది.

పదేళ్లు తెలంగాణ రాజకీయాలను ఏకచక్రాధిపత్యముగా ఏలిన కేసీఆర్, ప్రత్యర్థులను తన వాక్చాతుర్యంతో నోరు మూయించగలిగిన కేటీఆర్ ఇప్పుడు కవిత ఆరోపణలకు బదులు చెప్పలేని బలహీనులుగా మారారు అంటే అది ఇంటి గుట్టు మహిమేనా.?

ADVERTISEMENT
Latest Stories