వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఇప్పటికే 13 మంది టీడీపీ తీర్థం పుచ్చుకోగా, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ లైన్ లో ఉన్నారు. ఇదిలా ఉండగానే, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ‘జంపింగ్’కు సంబంధించి ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. బుడ్డా పార్టీ మారనున్నట్లు ఇప్పటికే ఖరారైనా… ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే స్వయంగా బుడ్డానే టిడిపిలో చేరబోతున్నట్లుగా స్పష్టం చేసారు.
తన నియోజకవర్గ పరిధిలోని బండి ఆత్మకూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన బుడ్డా ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని, శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ… కార్యకర్తల అభీష్టం మేరకే తాను టీడీపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఈ నెల 28న టీడీపీలో చేరుతున్నానని, తన నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుంచి 35 బస్సుల్లో తన అనుచరగణం విజయవాడకు తరలనుందని బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు.



