కాదేది కవితకనర్హం అని మహాకవి శ్రీశ్రీ అంటే ‘కాదేదీ వ్యాపారానికనర్హం’ అన్నారు ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్’ యాజమాన్యం.
ఓ వైపు శరవేగంగా దేశ జనాభా పెరిగిపోతుంటే మరోవైపు పిల్లలు లేని దంపతులు సంతానం కోసం పరితపిస్తూనే ఉన్నారు.
కనుక వారి బలహీనత, భావోద్వేగాలు, ఆర్ధిక పరిస్థితిని అవకాశంగా మార్చుకొని ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్’ మూడు టెస్ట్ ట్యూబ్ బేబీలు ఆరు సరోగసీలతో అద్భుతంగా వ్యాపారం చేసుకుంటోంది.
సికింద్రాబాద్‌లో ఓ దంపతులకు ఈవిదంగా కలిగిన శిశువుకి క్యాన్సర్ వ్యాధి సోకడంతో తల్లి తండ్రులు షాక్ అయ్యి అనుమానంతో డీఎన్ఏ పరీక్ష చేయగా ఆ శిశువుకి తండ్రి వేరే వ్యక్తి అని తేలడంతో గోపాలపురం పోలీసులకు పిర్యాదు చేశారు.
వారు కేసు నమోదు చేసుకొని సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో సోదాలు నిర్వహించగా ఊహించలేని అనేక భయంకర రహస్యాలు బయటపడ్డాయి. పోలీసులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా సృష్టి సంతాన సాఫల్య కేంద్రాలున్నాయి. పోలీసులు విశాఖకు వెళ్ళి అక్కడ కేంద్రంలో తనికీలు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సృష్టి సెంటర్ల నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతని అరెస్ట్ చేసి విశాఖ కోర్టు అనుమతితో హైదరాబాద్ తరలించారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం డాక్టర్ నమ్రత పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ, నిరుపేద మహిళలని డబ్బు ఆశ జూపి సరోగసీ (అద్దె గర్భం) కొరకు వాడుకునేవారు.
పిల్లలు లేని దంపతులకు భర్త ఇచ్చిన వీర్య కణాలకు బదులు తమ వద్ద నిలువచేసిన ఇతర పురుషుల వీర్య కణాలతో ఫలదీకరణం చేసి, అలా పుట్టిన పిల్లలు ఆ దంపతుల అండం, వీర్యకణంతోనే జన్మించారని నమ్మబలికేవారు.
ఈవిదంగా ఎన్ని వేలమందిని మోసం చేశారో విచారణలో తేలాల్సి ఉంది. సరోగసీ కోసం పేద మహిళలని ఏర్పాటు చేసుకునేందుకు సృష్టించుకున్న దళారీ వ్యవస్థకి సంబంధించి వివరాలు కూడా విచారణలో తేలుతుంది.
2020లోనే డాక్టర్ నమ్రతపై ఇటువంటి ఆరోపణలు రావడంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్పుడే ఆమె లైసెన్సును రద్దు చేయగా, ఆమె ఇతర డాక్టర్ల లైసెన్సులతో ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఒకరి అవసరాలు, భావోద్వేగాలు, మరొకరి పేదరికాన్ని ఈవిదంగా ఉపయోగించుకోవడమే చాలా ఏహ్యమైన పని కాగా, ఇప్పుడు ఈ మోసం బయటపడటంతో సృష్టి సెంటర్ల ద్వారా సంతానం పొందినవారు ఇప్పుడు తమ సంతానాన్ని అనుమానించే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇంకా దారుణం.




