ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న “రాజు గారి గది 2” సినిమా ప్రభావం మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 151వ సినిమా “సైరా నరసింహారెడ్డి”పై ఖచ్చితంగా పడే సంకేతాలు కనపడుతున్నాయి. స్వల్ప బడ్జెట్ తో ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజు గారి గది 2’ సినిమాకు, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 150 కోట్లతో నిర్మించబోయే ‘సైరా’తో పోల్చడమా? అంటే… అన్ని యాంగిల్స్ లో పోల్చలేం గానీ, సంగీతం పరంగా ఏ.ఆర్.రెహమాన్ పై తీవ్ర ఒత్తిడి వచ్చే విధంగా ఎస్.ఎస్.థమన్ ‘రాజు గారి గది 2’ ద్వారా తీవ్ర ప్రభావం చూపుతున్నాడన్నది వాస్తవం.
ఈ సినిమాకు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు అదిరిపోయే స్పందన లభించడంతో, మెగాస్టార్ చేయబోయే ‘సైరా’ సినిమాకు కూడా థమన్ ను ఎంపిక చేయాలన్న డిమాండ్ పెచ్చుమీరుతోంది. అందులోనూ ‘సైరా’ టీజర్ కు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ ఇచ్చి ఇప్పటికే తానేమిటో నిరూపించుకున్నాడు కూడా! దీంతో త్వరలో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ అయితేనే కరెక్ట్ అంటూ మెగా అభిమానులు మక్కువ చూపుతున్నారు గానీ, మార్కెట్ రేంజ్ రీత్యా రెహమాన్ ను తప్పించే సాహసం చేయకపోవచ్చు.
తెలుగు నట మణిశర్మ తర్వాత ఆ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో తన సత్తాను చాటుతున్నాడు థమన్. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ కొనసాగుతున్నప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ లో మాత్రం థమన్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడన్నది అందరూ అంగీకరించే సత్యం. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై ‘మహానుభావుడు’ ద్వారా పాటలతోనూ, బ్యాక్ గ్రౌండ్ తోనూ మారుమ్రోగిన థమన్ నామధేయాన్ని ‘రాజు గారి గది 2’ మరింత రెట్టింపు చేసింది. రాబోయే రోజుల్లో అగ్ర హీరోల సినిమాలు థమన్ వశం కావడం ఖాయంలా కనపడుతోంది.


