ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం సహా వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్ పదవులను భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తితిదే ఛైర్మన్‌గా యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు.
ఈ నిర్ణయం గతంలోనే తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అప్పట్లో బీజేపీ అభ్యంతరంతో పక్కన పెట్టారు. ఇప్పుడు పొత్తు విఫలం కావడంతో ఆయనకు రూట్ క్లియర్ అయ్యింది. పుట్టాకు నామినేటడ్ పదవి ఇవ్వడంతో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలోకి తెచ్చి మైదుకూరు టికెట్ ఇవ్వడానికి రంగం సిద్ధం అయినట్టుగా ఉంది.
మరోవైపు ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. తద్వారా ఆయనను పీలేరు నియోజకవర్గం నుండి తప్పించినట్టు అయ్యింది. వైఎస్సాఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు చాలా కాలం నుండి ఉన్నవి.
కిశోర్‌కుమార్‌రెడ్డిని పక్కకు తప్పించడంతో పెద్దిరెడ్డితో ఏదైనా డీల్ కుదిరిందా అనే అనుమానం రాక మానదు. అదేగనుక నిజమైతే వైకాపాకు చిత్తూరు జిల్లాలో పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. ఈ జాబితాలో మరి కొంత మంది సీనియర్లకు చోటిచ్చారు. ఆర్టీసీ ఛైర్మన్‌గా వర్ల రామయ్య, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా జూపూడి ప్రభాకర్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బరాయుడును నియమించారు.



