చోరీలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ మానసిక పరిస్థితి సరిగా లేని ఓ యువకుడిని కొందరు కట్టేసి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అతడిని కొడుతుండగా వారు సెల్ఫీలు కూడా దిగారు. కేరళలో జరిగిన ఈ ఘటన పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఆ యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.
తాజాగా ఆ యువకుడి పేరు మధు అని తెలిసింది. దీనిపై ప్రముఖ స్టార్ హీరో మమ్ముట్టి తన ఫేస్‌బుక్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు ఆదివాసి కాదని, తన సోదరుడు లాంటి వాడని, దుండగులు తన సోదరుడిని చంపేశారని అన్నారు. మనిషిగా ఆలోచిస్తే చనిపోయిన మధు నిందితులకి కూడా సోదరుడిగా, కుమారుడిగా కనిపిస్తాడని పేర్కొన్నారు.
అతడు మనలాగే పౌరుడని, అతడికి కూడా హక్కులు ఉంటాయని, ఆకలి కోసం దొంగతనం చేసేవారిపై దొంగ అనే ముద్ర వేయకూడదని, పేదరికాన్ని సమాజమే సృష్టించిందని భావోద్వేగపూరితంగా పోస్ట్ చేశారు. కారణం ఏదైనా ఓ మనిషి మరో మనిషిపై దాడి చేయడం తప్పని పేర్కొంటూ, ‘సారీ మధు’ అని అన్నారు మమ్ముట్టి.



