తెలంగాణాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు అవుతుంది. అయినా కేబినెట్ పై సస్పెన్స్ కొనసాగిస్తున్నారు కేసీఆర్. తాజాగా వస్తున్న ఊహాగానాల ప్రకారం తెలంగాణలో వెంటనే పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు కాదని, ఈ నెలాఖరుకు ఆరు లేదా ఏడుగురిని పదవులలోకి తీసుకుంటారని, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెరాసలో కొందరి సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి దీని మీద పని చేస్తున్నారట.
[m9ad]
రాజ్యాంగాన్ని అనుసరించి తెలంగాణ కేబినెట్ లో 17 మంది మంత్రులు ఉండవచ్చు.ఈసారి మంత్రివర్గ కూర్పును ఆయన ఆషామాషీగా తీసుకోవటం లేదని, వివిధ రకాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా, ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు తీర్చేలా పాలన ఉండేందుకు మంత్రులను నియమించే అవకాశం ఉందని సమాచారం. వ్యక్తుల కోసం కాకుండా పని కోసం మంత్రులను నియమించాలని, నూటికి నూరు శాతం విధేయులనే ఈసారి కేబినెట్‌లోకి తీసుకోవాలని కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఎలాంటి మొహమాటాలకు పోకుండా, సమీకరణలు, ఆవశ్యకతల నుంచి కాకుండా కేవలం పనితీరు ప్రాతిపదికగానే మంత్రివర్గ సహచరులను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆరు లేదా ఏడుగురు అంటే ఇప్పుడున్న ఇద్దరితో పాటు 10 లోపే ఉండొచ్చు. అయితే సహజంగా కులాల వారీగా కేబినెట్ కూర్పు లేకపోతే ఎన్నికలలో ఇబ్బంది అవ్వొచ్చు అంటారు. ఈ క్రమంలో కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతటి నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.
మరోవైపు హరీష్ రావు దగ్గర నుండి నీటిపారుదల శాఖ తీసేసుకుంటారు అని వస్తున్న వార్తలపై పార్టీ వారికి ఎవరికీ సమాచారం లేదు. గత వారం జరిగిన ప్రోజెక్టుల సమీక్షకు హరీష్ ను పిలవని సంగతి తెలిసిందే. దీనితో ఇప్పటిదాకా ఎవరు దానిని ఖండించలేకపోతున్నారు. దీనితో ఆ విషయమై చివరి దాకా సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు కాసేపటి క్రితం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఛార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి హరీష్ కూడా హాజరు అయ్యారు.



