విశాఖలోనే ప్రమాణస్వీకారమట… రాజధానట!

Botsa Satyanarayana Challenge

మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “జూన్ 9వ తేదీన జగన్మోహన్‌ రెడ్డిగారు విశాఖ నగరంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత విశాఖ రాజధానిగా పాలన ప్రారంభిస్తారు. ఆయన ప్రమాణస్వీకారం తర్వాత విశాఖ నగరం ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుంది,” అని అన్నారు.

సజ్జల రామకృష్ణా రెడ్డితో సహా వైసీపి నేతలందరూ ఓటమి ఖాయమ్మన్నట్లు ఆక్రోశిస్తుంటే బొత్స సత్యనారాయణ ఈవిదంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వైసీపి శ్రేణులు చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. ఒకవేళ నిజంగానే వైసీపి గెలిచినా జగన్‌ విశాఖలో ప్రమాణ స్వీకారం చేయగలరు కానీ విశాఖను రాజధానిగా ప్రకటించలేరు. రాజధాని కేసు సుప్రీంకోర్టులో ఉన్నందునే, జగన్‌ ఋషికొండని చెక్కించేసి సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేసి నిర్మించుకున్న ప్యాలస్‌లో అడుగుపెట్టేందుకు కూడా జంకుతున్న సంగతి తెలిసిందే. కనుక జగన్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఇది ఆయన పరిధికి మించినది కనుక విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు.

ADVERTISEMENT

ఒకవేళ ఏపీలో వైసీపి 175/25 సీట్లు గెలుచుకొని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితేనే, అప్పుడు కాంగ్రెస్‌ లేదా బీజేపీలో ఏదో ఓ కూటమికి మద్దతు ఇచ్చి రాజధాని విషయంలో జగన్‌ తన పంతం నెగ్గించుకోగలుగుతారు.

కానీ ఇక్కడ రాష్ట్రంలో వైసీపి ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతల ఏడుపులతోనే స్వయంగా చాటింపు వేసుకుంటున్నారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ కనీసం 300 ఎంపీల మద్దతుతో అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ చెపుతున్నాయి.

ఐదేళ్ళు భారీ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా జగన్‌ ప్రభుత్వం విశాఖ నగరాన్ని కనీసం అభివృద్ధి చేయలేదు. ఈ 5 ఏళ్ళలో వైసీపి రంగులు వేసుకోవడం, జగన్‌ ఫోటోలతో బోర్డులు ఏర్పాటు చేసుకోవడమే తప్ప నగరంలో కొత్తగా ఒక్క ఫ్లైఓవర్‌ కూడా నిర్మించలేదు. విశాఖని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామంటే సుప్రీంకోర్టు వద్దంటుందా?

కానీ ఐదేళ్ళు మూడు రాజధానులు, విశాఖ రాజధాని అంటూ జగన్‌ ప్రభుత్వం కాలక్షేపం చేసేసింది. చివరికి తమ తాజా ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా విశాఖ రాజధాని గురించి గట్టిగా నాలుగు వాఖ్యలు వ్రాయడానికి, ఎన్నికల ప్రచారంలో విశాఖ రాజధానిగా ఉంటుందని చెప్పడానికి కూడా వైసీపి నేతలు భయపడ్డారు. కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని చేస్తాము… నమ్మమంటున్నారు.

కనుక విశాఖలో ప్రమాణస్వీకారం, విశాఖ రాజధాని అంటూ బొత్స సత్యనారాయణ చెపుతున్న ఈ మాటలు ఈ 20 రోజులు కాలక్షేపానికి చెపుతున్న కబుర్లుగానే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories