శ్రీకాకుళంలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు: తమ్మినేని

Tammineni Nag on Srikakulam YSRCP

ఇటీవల విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిన్న శ్రీను పార్టీకి, పదవులకు రాజీనామా చేసి టీడీపిలో చేరిపోవడంతో జిల్లా వైసీపీ, ముఖ్యంగా బొత్స సత్యనారాయణ కుటుంబం కలవరపడుతూనే ఉంది.

తాజాగా శ్రీకాకుళం జిల్లా వైసీపీలో కూడా ముసలం పుట్టింది. మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్, నేడు తన తండ్రి ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఆయన సోదరుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌ తదితరులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

ADVERTISEMENT

జగన్మోహన్ రెడ్డి వీరిని నమ్మి జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తే, పేనుకు పెత్తనం ఇస్తే జుట్టంత గొరిగేసినట్లు, జిల్లాలో వైసీపీని నిలువునా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

“మిమ్మల్ని నమ్మిన జగన్ మోహన్ రెడ్డిని, మీ చేతిలో ఉన్న ఈ పార్టీని నిలువునా ముంచెయ్యాలని అనుకుంటున్నారా? వచ్చే ఎన్నికలలో ఇతనే వైసీపీ అభ్యర్ధి అని ప్రచారం చేసుకుంటున్నారు. చేసుకోండి. కానీ ఇది మీ అభ్రతభావానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఆయనని అభ్యర్ధిగా ప్రచారం చేస్తూ మీరే అయనని బలిపశువుగా చేస్తున్నారని చెప్పగలను.

రాజకీయ పార్టీ అంటే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నాన్నగారిని (తమ్మినేని సీతారాం)ని నియమించారు. కానీ ఆయనకు మీరిస్తున్న గౌరవం ఇదేనా?

జిల్లాలో వైసీపీ పెద్దల తీరు ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. కావాలంటే సర్వే చేయించుకొని నివేదికలు తెప్పించుకొని చూసుకుంటే, ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందో తెలుస్తుందని తమ్మినేని నాగ్ అన్నారు.

జిల్లా వైసీపీలో వారు తమ కులం వారినే ప్రోత్సహిస్తూ, మిగిలినవారికి పార్టీలో ప్రాధాన్యత లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము వైసీపీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పార్టీ కోసం వెనక్కు తగ్గుతున్నకొద్దీ రెచ్చిపోతున్నారని, ఇక ఎంత మాత్రం సహించే ప్రసక్తి లేదని,” తమ్మినేని నాగ్ హెచ్చరించారు.

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన వర్గానికి, తమ్మినేని వర్గానికి మద్య చాలా కాలంగా ఈ నిప్పు రగులుతూనే ఉంది. నేడు తమ్మినేని నాగ్ మీడియా సమావేశంతో అది భగ్గుమంటూ బయటపడింది.

తమకంటే వయసులో, అనుభవంలో చిన్న వాడైన తమ్మినేని నాగ్, మీడియా సమావేశంలో తమపై ఈ స్థాయిలో విరుచుకుపడటం వారూ జీర్ణించుకోవడం చాలా కష్టమే. కనుక గట్టిగా జవాబు చెప్పాల్సి ఉంటుంది. చెప్తే ఒక బాధ. చెప్పకపోతే మరో బాధ!

విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్రా జిల్లాలను వైసీపీ కుమ్మేద్దామనుకుంటే, మరేదో జరిగింది. ఇప్పుడు భయంభయంగానే స్థానిక సంస్థలకు వెళుతుంటే ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీలో ఇలాంటి అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. తమ్మినేని నాగ్ భవిష్యవాణి నిజమవబోతోందా? ఏమో!

ADVERTISEMENT
Latest Stories